Saudi Arabia: సౌదీ క్షిపణి దాడిలో కామారెడ్డి వాసికి తీవ్ర గాయాలు.. హైదరాబాద్ వాసి మృతి..!
సౌదీలో భయంకర పరిస్థితులు నెలకున్నాయి. సౌదీ అరేబియాలోని రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై శనివారం క్షిపణి దాడి జరిగింది. ఈ దాడిలో 13 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. క్షిపణి దాడులో 300 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో హైదరాబాద్ వాసి కూడా ఉన్నాడు. హైదరాబాద్‌కు చెందిన యూసుఫ్ దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఉద్యోగరిత్యా యూసుఫ్ సౌదీలో ఉంటున్నారు. భార్యాపిల్లల్ని చూసేందుకు ఈ నెల ఇంటికి వచ్చారు. మదినాను దర్శించుకోవాలనే ఉద్దేశంతో యూసుఫ్ కుటుంబ సభ్యులను తీసుకుని సౌదీకి వెళ్లాడు. మదినాకు వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చినప్పుడు దాడి జరిగింది. యూసఫ్ కుటుంబ సభ్యులకు గాయాలు కాగా యూసుఫ్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.
మెహిదీపట్నానికి చెందిన మహ్మద్ యూసుఫ్ అలీ (45) పదేళ్ల క్రితం ఉద్యోగరీత్యా సౌదీకి వెళ్లారు. రియాద్‌లో ఐటీ ఇంజినీర్ గా పని చేస్తున్నారు. యూసుఫ్‌కు భార్య సమీరాతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమారుడు ఆమన్ బీటెక్ చదువుతుండగా చిన్న కుమారుడు వాసే ఖురాన్, కుమార్తె ఆరో తరగతి చదువుతోంది. వీరు రెండేళ్లుగా మెహిదీపట్నంలోనే నివాసిస్తున్నారు. ఏడాదికి ఒకసారి రియాద్ నుంచి వచ్చి వెళ్తుండేవాడు. అలా యూసుఫ్ అలీ 15 రోజుల క్రితం సౌదీ నుంచి నగరానికి వచ్చి.. కుటుంబంతో కొన్ని రోజులు గడిపాక ఈ నెల 2న భార్యాపిల్లల్ని తీసుకొని తిరిగి సౌదీకి వెళ్లిపోయారు. గాయపడిన వారిలో కూడా తెలుగు వారు ఉన్నట్లు తెలిసింది.

క్షిపణి దాడుల్లో కామారెడ్డికి చెందిన 36 ఏళ్ల షేక్ సయీద్ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం వచ్చింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చినట్లు తెలిసింది. రియాద్‌లోని కింగ్ ఫహద్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స జరుగుతుందని స్థానికులు తెలిపారు. కామారెడ్డిలోని సైనీ బాబా కాలనీకి చెందిన షేక్ సయీద్ సుమారు 12 ఏళ్లుగా సౌదీ అరేబియాలో ఉంటున్నారు. కొన్నేళ్లుగా రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని స్టార్‌బక్స్‌లో ఉద్యోగం చేస్తున్నారు. సౌదీలో తెలుగు రాష్ట్రాల వారు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా తెలంగాణకు చెందినవారు అందులో హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన వారు ఎక్కువగా ఉంటారు.
రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం సౌదీలోని లక్షలాది మంది ప్రవాస భారతీయులకు అడ్వైసరీ జారీ చేసింది. ప్రస్తుత వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని భారతీయులందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరింది. అవసరం అయితే తప్ప బయటకు రావొద్దని కోరింది. స్థానిక అధికారిక మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. అత్యవసర సహాయం కోసం రాయబార కార్యాలయం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ 00-966-11-4884697, [email protected] ఈమెయిల్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications