కోవిషీల్డ్ ఉత్పత్తిపై సీరమ్ సీఈఓ సంచలన నిర్ణయం: లండన్ నుంచి కీలక ప్రకటన
ముంబై: కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోన్న వేళ.. దాన్ని నిర్మూలించడానికి వ్యాక్సినేషన్ కార్యక్రమంల కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. దేశవ్యాప్తంగా టీకాల కొరత ఏర్పడుతోంది. మూడోదశ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇవ్వాళే ఆరంభమైనప్పటికీ.. దాన్ని విజయవంతంగా అమలు చేయలేని పరిస్థితిని దేశం ఎదుర్కొంటోంది. ఏపీ, తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత నెలకొని ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిషీల్డ్ (Covishield), కోవాగ్జిన్ (Covaxin) వ్యాక్సిన్లు ఏ మాత్రం చాలట్లేదు. మూడు షిఫ్టుల్లో వ్యాక్సిన్ ఉత్పత్తి కొనసాగుతోన్నప్పటికీ.. డిమాండ్‌ను అందుకోలేకపోతోన్నాయి.

రెట్టింపు కోసం.. దేశం వెలుపలా
ఈ పరిణామాల మధ్య కోవిషీల్డ్ ఉత్పాదక సంస్థ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యాక్సిన్ ఉత్పత్తిని రెట్టింపు చేయడంపై దృష్టి సారించింది. దేశం వెలుపల కూడా వ్యాక్సిన్‌ను ఉత్పత్తిని చేసే దిశగా చర్యలను తీసుకుంటోంది. ఈ దిశగా కొన్ని భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను రెట్టింపు చేయాలనే ఏకైక లక్ష్యంతో దేశం వెలుపల కూడా ఉత్పత్తిని పెంచేలా చర్యలను ఇప్పటికే ప్రారంభించామని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆదార్ పూనావాలా వెల్లడించారు.

లండన్‌లో ఉంటోన్న ఆదార్
ది టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన లండన్‌లో ఉంటున్నారు. అక్కడే ది టైమ్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అనేక కీలక విషయాలను ప్రస్తావించారు. కోవిషీల్డ్ ఉత్పత్తిని బ్రిటన్‌లోనే చేపట్టే అవకాశాలు లేకపోలేదంటూ పరోక్షంగా సంకేతాలను పంపించారు. ఎక్కడ ఉత్పత్తి ప్రారంభిస్తామనే విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడుతుందని అన్నారు.

ప్రతి నెలా 100 మిలియన్ డోసులు
వచ్చే జులై నాటికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పాదక సామర్థ్యాన్ని నెలకు 100 మిలియన్ డోసుల మేరకు పెంచాలనేది తమ లక్ష్యమంటూ ఆదార్ పూనావాలా ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఈ కాల పరిధిని ఆయన తగ్గించారు. దేశంలో నెలకొన్న కరోనా వ్యాక్సిన్ కొరత, పలు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి అందుతోన్న ఆర్డర్లు, విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని.. మే చివరి నాటికే ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచుతామని పేర్కొన్నారు.

ఏటేటా మూడు బిలియన్ల టీకాలు..
మే చివరి నాటికి ప్రతినెలా 100 మిలియన్ డోసులను ఉత్పత్తి చేసేలా సంస్థ సామర్థ్యాన్ని పెంచుతామని వెల్లడించారు. ప్రతి సంవత్సరానికీ రెండున్నర నుంచి మూడు బిలియన్ల వరకు టీకాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని ఆరు నెలల వ్యవధిలో పెంచుకుంటామని ఆదార్ పూనావాలా తాజాగా వెల్లడించారు. దేశంలో వ్యాక్సినేషన్ కొరత ఉందనే విషయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరాను పెంచుతామని, వీలైనంత త్వరగా కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తామని చెప్పారు.

నాలుగు లక్షలను దాటిన కరోనా కేసులు..
మరోవంక- దేశంలో రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. కేంద్రం కొద్దిసేపటి కిందటే విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. దేశంలో 24 గంటల వ్యవధిలో 4,01,993 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 3,523 మంది మరణించారు. 2,99,988 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,91,64,969 చేరాయి. ఇందులో 1,56,84,406 మంది కోలుకున్నారు. ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 2,11,852 మంది కరోనా కాటుకు బలి అయ్యారు. యాక్టివ్ కేసులు 32,68,710గా నమోదయ్యాయి. ఇప్పటిదాకా 15,49,89,635 మంది వ్యాక్సిన్ వేసినట్లు కేంద్రం వెల్లడించింది.


Click it and Unblock the Notifications