FY21లో సెన్సెక్స్ 66% జంప్, రికార్డుల హోరు: కరోనాతో కొత్త బిలియనీర్లు..
కరోనా నేపథ్యంలో గత ఏడాది మార్చి 23వ తేదీన మార్కెట్లు కుప్పకూలాయి. అంతకుముందు వరకు 41వేల మార్కు క్రాస్ చేసిన సెన్సెక్స్, మహమ్మారి భయంతో ఏకంగా 26వేల దిగువకు పడిపోయింది. ఆర్థిక రికవరీ నేపథ్యంలో గత ఆరు నెలలుగా మార్కెట్లు ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. సెన్సెక్స్ ఇటీవల 52వేల మార్కును కూడా క్రాస్ చేసింది. నవంబర్‌లో 42వేల పాయింట్ల నుండి ఈ కాలంలో పదివేల పాయింట్లు ఎగిసింది. కరోనా సమయంలో భారీగా లాభపడిన స్టాక్స్‌లో ఔషధ, ఆరోగ్య సంరక్షణ రంగాలు ఉన్నాయి. ఈ రంగంలోని కంపెనీలను నిర్వహిస్తున్న ప్రమోటర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది.

భారీ పతనం నుండి రికార్డులు
కరోనా ఆర్థిక వ్యవస్థను ముంచివేస్తోందనే భయాలతో గత ఏడాది మార్చిలో సెన్సెక్స్ ఏకంగా 23% (8,828.8 పాయింట్లు) నష్టపోయింది. మార్చి 23న సెన్సెక్స్ 3,935 పాయింట్లు నష్టపోయి 25,981 కనిష్టాన్ని తాకింది. మరుసటి రోజు సెన్సెక్స్ మరింత నష్టపోయి ఇంట్రాడేలో 23,639 వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ గతంలో ఒక నెలలో లేదా ఒకరోజు ఎన్నడు ఇంత భారీ స్థాయిలో నష్టపోలేదు.
అయితే ఆ తర్వాత తిరిగి రికార్డులు సృష్టించింది. కేంద్రం ఉద్దీపన చర్యల నేపథ్యంలో నవంబర్ నుండి సెన్సెక్స్ రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే (FY21) సెన్సెక్స్ 19,540 పాయింట్లు లేదా 66.30 శాతం ఎగిసింది. గత ఏడాది ఏప్రిల్ 3వ తేదీన 27,500 పాయింట్ల కనిష్టం నుండి ఈ ఏడాది ఫిబ్రవరి 3న 50,000 పాయింట్లను దాటింది. ఫిబ్రవరి 16వ తేదీ నాటికి 52,516 పాయింట్లను తాకింది. ఆ తర్వాత సెకండ్ వేవ్ ఒడిదుడుకుల వల్ల ప్రస్తుతం 49,000 పాయింట్ల వద్ద ఉంది.

ప్రభుత్వం, ఆర్బీఐ చర్యలు
ఆర్థిక వ్యవస్థను సరిదిద్దేందుకు కేంద్రం, ఆర్బీఐ వెంటవెంటనే చర్యలు చేపట్టడం కలిసి వచ్చింది. రుణ వసూళ్లపై 6 నెలలపాటు మారటోరియం విధించారు. ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వ హామీ కల్పించారు. కంపెనీలపై దివాలా ప్రక్రియను ఏడాది రద్దు చేశారు. ఫిబ్రవరి 1న ప్రకటించిన కేంద్ర బడ్జెట్ కూడా మార్కెట్‌ను ఊతమిచ్చింది. దీంతో మార్కెట్లో నిధుల సరఫరా పెరిగింది. వడ్డీ రేట్లు పదేళ్ల కనిష్ఠస్థాయికి పడిపోయాయి. ఇది మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఉపకరించింది. బేర్ ఆపరేటర్ల పట్టుతో షేర్ల ధరలు ఆకర్షణీయంగా మారాయి. దీన్ని అవకాశంగా చేసుకుని FPIలతో సహా దేశీయ ఇన్వెస్టర్లు స్టాక్స్‌లో పెట్టుబడులకు దిగారు. ఇవన్నీ ఈ ఆర్థిక సంవత్సరం దేశీయ స్టాక్ మార్కెట్ పరుగుకు ఉపయోపడ్డాయి.

రికార్డులు ఇలా..
2020-21లో బీఎస్ఈ సెన్సెక్స్ 19,5 40.01 పాయింట్లు లేదా 66.30 శాతం లాభపడింది. 2020 మార్చిలో సెన్సెక్స్ 8,828.80 పాయింట్లు లేదా 23 శాతం పతనమైంది. గత ఏడాది ఏప్రిల్ 3న 27,500.59 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. అయితే అంతకుముందు FY19లో (మార్చి 2020) 26వేల పాయింట్ల దిగువకు కూడా పడిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరి 16న రికార్డ్ స్థాయి 52,516.76 పాయింట్లను చేరుకుంది.

వీరి సంపద జంప్
కరోనా కారణంగా ఔషధ, ఆరోగ్య రంగాల స్టాక్స్ జంప్ చేశాయి. అంతకుముందు 2019లో ఔషధ, ఆరోగ్య సంరక్షణ రంగాల నుంచి 10 మంది బిలియనీర్ ప్రమోటర్లు ఉండగా, 2020 డిసెంబర్ నాటికి వీరి సంఖ్య 17కు చేరుకుంది. వీరి నికర సంపద గత ఏడాది ఏకంగా 61 శాతం (రూ.1.65 లక్షల కోట్లు) పెరిగి, క్యుములేటివ్ సంపద విలువ రూ.4.35 లక్షల కోట్లకు చేరుకుంది. కరోనా సమయంలో ఈ కంపెనీల షేర్ల ధరలు భారీగా పెరగడంతోనే వీరి సంపద బాగా వృద్ధి చెందింది.


Click it and Unblock the Notifications