ఆర్థిక సర్వే, బడ్జెట్‌కు ముందు మార్కెట్ పరుగు, సెన్సెక్స్ 800 పాయింట్లు జంప్
ఆర్థిక సర్వేకు ముందు స్టాక్ మార్కెట్లు పరుగులు పెట్టాయి. ఇటీవల రెండు వారాలు కుప్పకూలిన మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ జనవరి 17వ తేదీ నుండి 4000 పాయింట్లకు పైగా నష్టపోయింది. అయితే నేడు ఎగిసిపడింది. సెన్సెక్స్ 58,000ను క్రాస్ చేసింది. సెన్సెక్స్ క్రితం సెషన్‌లో 57,200 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు ఆరంభంలోనే దాదాపు 700 పాయింట్లు లాభపడింది. 57,845.91 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, 58,069.13 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,746.15 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,301.05 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,361.65 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,264.15 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.
మధ్యాహ్నం గం.12.00 సమయానికి సెన్సెక్స్ 819.04 (1.43%) పాయింట్లు లాభపడి 58,019.27 పాయింట్ల వద్ద, నిఫ్టీ 246.15 (1.44%) పాయింట్లు ఎగిసి 17,348.10 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. విప్రో, ఓఎన్జీసీ, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు రాణించగా, ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ స్టాక్స్ ఒత్తిడిలో ఉన్నాయి.

ఆర్థిక సర్వే, బడ్జెట్‌కు ముందు మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. ఆర్థిక సర్వే వృద్ధి రేటు అంచనాలను 9 శాతంగా అంచనా వేయవచ్చుననే వార్తలు సూచీలకు కాస్త బలాన్ని ఇచ్చాయి. అలాగే, బడ్జెట్‌కు ముందు నిన్నటి వరకు సూచీలు కుప్పకూలాయి. కనిష్టాల వద్ద కొనుగోళ్లు, అలాగే బడ్జెట్‌లో ఆయా రంగాలకు ఊతమిచ్చే చర్యలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి. ఆర్థిక రికవరీని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చునని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగాల సృష్టి, వృద్ధి ఆధారిత పెట్టుబడులు బడ్జెట్‌లో ప్రకటించవచ్చునని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సూచీలు సానుకూలంగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications