భారీ లాభాల నుండి భారీ నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ నేటి హైతో 1000 పాయింట్లు డౌన్
ముంబై: ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు అంతే భారీ నష్టాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో 51,280 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్ నేడు ఓ సమయంలో 500 పాయింట్లకు పైగా లాభపడి 52వేల దిశగా కనిపించింది. కానీ అంతలోనే కిందకు పడిపోయింది. ఉదయం నుండి క్రమంగా పతనమై, మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయానికి నష్టాల్లోకి వెళ్లింది. ఓ సమయంలో 720 పాయింట్లకు పైగా పతనమైంది. చివరలో కాస్త కొలుకొని దాదాపు 500 పాయింట్ల భారీ నష్టాల్లో ముగిసింది.

మార్కెట్ భారీ లాభాల నుండి భారీ నష్టాల్లోకి
సెన్సెక్స్ నేడు 51,660.98 పాయింట్ల వద్ద ప్రారంభమై, 51,821.84 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 50,538.43 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నేటి గరిష్టం నుండి సెన్సెక్స్ 1300 పాయింట్ల మేర పడిపోయింది. అలాగే ఆ గరిష్టం నుండి 1,000 పాయింట్లకు పైగా నష్టంతో ముగిసింది. సెన్సెక్స్ -487.43 (0.95%) పాయింట్లు నష్టపోయి 50,792 పాయింట్ల వద్ద, నిఫ్టీ -143.85 (0.95%) పాయింట్లు కోల్పోయి 15,030 పాయింట్ల వద్ద ముగిసింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో BPCL 2.70 శాతం, IOC 2.48 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 2.28 శాతం, JSW స్టీల్ 1.15 శాతం, టైటాన్ కంపెనీ 0.76 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో బజాజ్ ఆటో 3.13 శాతం, హిండాల్కో 2.98 శాతం,
SBI లైఫ్ ఇన్సురా 2.82 శాతం, HDFC లైఫ్ 2.81 శాతం, మారుతీ సుజుకీ 2.42 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో ఎస్బీఐ లైఫ్ ఇన్సురా, రిలయన్స్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ ఉన్నాయి.

అందుకే నష్టాలు
గత రెండు వారాలుగా మార్కెట్లు తీవ్ర అస్థిరతకు లోనవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మార్కెట్లు గరిష్ఠాలకు చేరుకోవడం, ఈ రోజు ప్రస్తుత వారానికి చివరి ట్రేడింగ్ సెషన్ కావడంతో ఇన్వెస్టర్లు చివరలో లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో మార్కెట్లు నష్టపోయాయి. యుటిలిటీస్, విద్యుత్, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్ల నుంచి కాస్త మద్దతు లభించడంతో మార్కెట్లు ఇంట్రాడే కనిష్ఠాల నుంచి కాస్త పైకి కదిలినా, చివరకు నష్టాల్లో ముగిశాయి.


Click it and Unblock the Notifications