ఉక్రెయిన్-రష్యా ఉద్రిక్తతలు: 1100 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్
ముంబై: స్టాక్ మార్కెట్ నేడు (మంగళవారం, 22 ఫిబ్రవరి) భారీ నష్టాల్లో ప్రారంభమైంది. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించడం, విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపిన నేపథ్యంలో మార్కెట్లు నిన్నటి వరకు వరుసగా నాలుగో రోజు నష్టపోయాయి. అమెరికా-రష్యా అధినేతలు జోబిడెన్, పుతిన్ మధ్య సమావేశం వార్తల నేపథ్యంలో నిన్న నష్టాలు కొంత తగ్గాయి. కానీ నేడు మాత్రం ప్రారంభంలోనే సూచీలు కుప్పకూలాయి. అన్ని రంగాలు కూడా నష్టాల్లోనే ఉన్నాయి.
సెన్సెక్స్ క్రితం సెషన్‌లో 57,683 పాయింట్ల వద్ద ముగిసింది. కానీ నేడు 57,000 పాయింట్ల దిగువకు వచ్చింది. ప్రారంభంలో ఓ సమయంలో 56,400 కంటే కిందకు పడిపోయింది. అంటే 1300 పాయింట్ల మేర పడిపోయింది. సెన్సెక్స్ ఉదయం 1200 పాయింట్ల వరకు పతనమై 56,438 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. కనీసం 57,000 పాయింట్ల గరిష్టాన్ని కూడా తాకలేదు.
ఈ వార్త రాసే సమయానికి సెన్సెక్స్ గరిష్టం 56,883 పాయింట్లు, కనిష్టం 56,395 పాయింట్లు. నిఫ్టీ కూడా ఉదయం గం.9.45 సమయానికి 337 పాయింట్లు క్షీణించి 16,869 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 17,206 పాయింట్ల వద్ద ముగిసినప్పటికీ, నేడు 17000 పాయింట్ల మార్కు దిగువకు పడిపోయింది.

మార్కెట్ నష్టాలకు ప్రధాన కారణం రష్యా-ఉక్రెయిన్ వివాదం. అక్కడి సరిహద్దుల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్ పైన పడింది. తదనుగుణంగా దేశీయ మార్కెట్ పైన కనిపించింది. ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద ప్రాంతాలను రష్యా స్వతంత్ర ప్రదేశాలుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. దీనిని ఉక్రెయిన్, అమెరికా సహా నాటో కూటమిలోని దేశాలు తప్పుబట్టాయి. రష్యాపై ఆంక్షలకు వెనుకాడేది లేదని ఐరోపా హెచ్చరించింది. మరోవైపు రష్యా గుర్తించిన ప్రాంతాలపై అమెరికా ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామాలు జాతీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది.


Click it and Unblock the Notifications