ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. గత వారం లాభాల్లో ముగిసిన మార్కెట్లు, ఈ వారం ప్రారంభంలో మాత్రం నష్టాలను చవిచూశాయి. నిన్న స్వల్పంగా లాభపడ్డాయి. అయితే ఈ రోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పలు చర్యలు ప్రకటించిన నేపథ్యంలో మార్కెట్ సెంటిమెంటును బలపరిచింది. వ్యవస్థలోకి నిధులు మళ్లించడం, రివర్స్ రెపో రేటు తగ్గించడం, ఎన్పీఏలకు సంబంధించి నిబంధనలు సడలించడం వంటి వివిధ కారణాలతో స్టాక్స్ దూసుకెళ్లాయి.
స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 986 పాయింట్లు (3.32 శాతం) లాభపడి 31,588.72 వద్ద, నిఫ్టీ 298 పాయింట్లు (3.22 శాతం) లాభపడి 9,291 పాయింట్లు వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 1,343 పాయింట్లు (6.92 శాతం) లాభపడి 20,742.80 వద్ద క్లోజ్ అయింది. ఫార్మా, ఎఫ్ఎంసీజీ మినహా దాదాపు అన్ని షేర్లు కూడా లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 2 శాతం లాభపడ్డాయి. డాలర్ మారకంతో రూపాయి కాస్త బలపడింది. 76.39 వద్ద క్లోజ్ అయింది. అంతకుముందు సెషన్‌లో 76.86 వద్ద క్లోజ్ అయింది. 47 పైసలు బలపడింది.

టాప్ గెయినర్స్ జాబితాలో యాక్సిస్ బ్యాంకు, ఐచర్ మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, మారుతీ సుజుకీ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో నెస్ట్లె, హిందూస్తాన్ యూనీలీవర్, భారతీ ఇన్ఫ్రాటెల్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా ఉన్నాయి. ఆర్బీఐ ఊతమిచ్చే ప్రకటనలకు తోడు అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఇది కూడా కలిసి వచ్చింది. యూరోపియన్, షాంఘై, హాంగ్‌కాంగ్, టోక్యో మార్కెట్లు లాభపడ్డాయి.


Click it and Unblock the Notifications