రష్యా-ఉక్రెయిన్ ఎఫెక్ట్, 670 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం (మార్చి 30) భారీ లాభాల్లో ఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య చర్చల్లో కాస్త సానుకూల పరిణామాలు కనిపించాయి. దీంతో అంతర్జాతీయ, భారత్ సహా ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 500 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ 17500 పాయింట్లకు సమీపంలో ఉంది. అమెరికా మార్కెట్లు మంగళవారం భారీగా లాభపడ్డాయి. అంతర్జాతీయ పరిణామాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి.

మార్కెట్ లాభాలకు కారణాలు...
ఉక్రెయిన్-రష్యా యుద్ధ పరిణామాలు నెల రోజులకు పైగా కొనసాగుతున్నాయి. అయితే ఇటీవల కీలక అడుగు పడింది. ఇరు దేశాల ప్రతినిధులు టర్కీలోని ఇస్తాంబుల్‌లో మంగళవారం మూడు గంటలకు పైగా చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలవంతమయ్యే దిశగా కనిపించాయి. అంతర్జాతీయ శాంతి ఒప్పందానికి మొగ్గు చూపాయి.
రాజీ దిశగా కనిపించడంతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. దీనికి తోడు చమురు ధరలు కాస్త శాంతిస్తున్నాయి. ఇది కూడా మార్కెట్ సెంటిమెంటును బలపరిచింది. అలాగే, చైనాలో కరోనా లాక్ డౌన్ కనిపించినప్పటికీ, భారత్ సహా అన్ని దేశాలు చర్యలు చేపట్టడం, ఈ ప్రభావం మనపై ఉండదనే అభిప్రాయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి.

ఆరంభమే అదరగొట్టింది
సెన్సెక్స్ క్రితం సెషన్‌లో 57,943 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు ఆరంభంలోనే 58,360 పాయింట్లు దాటింది. ఓ సమయంలో 58,615 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. ఏ దశలోను 58,100 దిగువకు రాలేదు. నిఫ్టీ కూడా 17,468 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. మధ్యాహ్నం గం.11.07 సమయానికి సెన్సెక్స్ 670 పాయింట్లు లేదా 1.16 శాతం లాభపడి 58,614 పాయింట్ల వద్ద, నిఫ్టీ 178 పాయింట్లు లేదా 1.03 శాతం ఎగిసి 17,503 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

ఈ రెండు మినహా...
మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు మినహా అన్ని రంగాలు లాభాల్లోనే ఉన్నాయి. మెటల్ మాత్రం 2 శాతం మేర, ఆయిల్ అండ్ గ్యాస్ 0.5 శాతం మేర క్షీణించాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, బ్యాంకు, రియాల్టీ రంగాలు 1 శాతం చొప్పున లాభపడ్డాయి. హీరో మోటో కార్ప్ సంస్థ కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో రూ.1000 కోట్ల మేర బోగస్ వ్యయాలకు సంబంధించిన ఆధారాలు లభించినట్లు వార్తలు వచ్చాయి. అయినప్పటికీ ఈ స్టాక్ పరుగులు పెట్టింది. ఇన్ఫోసిస్, ఎయిర్ టెల్, టాటాకన్స్యూమర్, బజాజ్ ట్విన్స్, యాక్సిస్ బ్యాంకులు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి.


Click it and Unblock the Notifications