సెన్సెక్స్ 1500 పాయింట్లు జంప్, అందుకే HDFC ట్విన్స్ అదరగొట్టాయి
స్టాక్ మార్కెట్లు అదరగొడుతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరాన్ని గతవారం లాభాలతో ప్రారంభించిన సూచీలు, రెండో రోజు పరుగు తీశాయి. సెన్సెక్స్ ఏకంగా 60,000 పాయింట్లు దాటి, 61,000 దిశగా కనిపిస్తోంది. నిఫ్టీ 18,000 పాయింట్లను దాటింది. ఉదయం గం.9.15 ప్రారంభమైన సెన్సెక్స్, ఏ దశలోను వెనక్కి తగ్గలేదు. అంతకంతకూ ఎగిసి 1500 పాయింట్ల లాభాల్లో కనిపించింది. సెన్సెక్స్ గతవారం 59,277 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు 500 పాయింట్ల లాభాల్లో ప్రారంభమైంది. నేడు సెన్సెక్స్ పరుగుతో ఇన్వెస్టర్ల పంట పండింది.

అందుకే భారీ లాభాల్లో
అంతర్జాతీయ మార్కెట్ సానుకూల సంకేతాలతో దేశీయ సూచీలు ఈ వారం లాభాలతో ప్రారంభమయ్యాయి. గతవారం FIIల కొనుగోలు తిరిగి ప్రారంభం కావడం మార్కెట్‌కు కలిసి వచ్చింది. అక్టోబర్ 2021 నుండి మార్చి 2022 నాటికి పెద్ద ఎత్తున ఎఫ్‌పీఐలు వెనక్కి వెళ్లగా, గతవారం మాత్రం కొనుగోళ్ల మద్దతు లభించింది.
దీనికి తోడు జీఎస్టీ వసూళ్లు రికార్డ్ స్థాయిలో నమోదయ్యాయి. వరుసగా ఏడో నెల రూ.1 లక్ష కోట్లు దాటాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య వాతావరణం చల్లబడుతోంది. చమురు ధరలు తగ్గుతున్నాయి. దీనికి తోడు ఈ నెల 6 నుండి 8 మధ్య ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష ఉంది.
దీనిపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. ఫెడ్ వడ్డీ రేటు 25 బేసిస్ పాయింట్లు మాత్రమే పెంచింది. దీంతో ఆర్బీఐ కూడా వడ్డీ రేటుపై దూకుడుగా వెళ్లే అవకాశాలు లేవని భావిస్తున్నారు. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. మూడో త్రైమాసికం ఫలితాలు సానుకూలంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.

1500 పాయింట్లు జంప్
ఈ పరిణామాల నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీలు ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 59,764 పాయింట్ల వద్ద ప్రారంభమై, 60,727 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 59,760.22 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ ఉదయం గం.11 సమయానికి 1,240 పాయింట్లు లేదా 2.11 శాతం ఎగిసి 60,517 పాయింట్ల వద్ద, నిఫ్టీ 329 పాయింట్లు లేదా 1.86 శాతం ఎగిసి 17,999 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
HDFC, HDFC బ్యాంకు, టైటాన్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ, హెచ్‌సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ షేర్లు లాభాల్లో ఉన్నాయి. సెన్సెక్స్ ఓ సమయంలో 1500 పాయింట్లు లాభపడింది.

HDFC పరుగు
HDFC బ్యాంకు లోన్ బుక్ వార్షిక ప్రాతిపదికన 20.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. HDFC బ్యాంకు, HDFC స్టాక్స్ ఓ సమయంలో 14 శాతం మేర లాభపడ్డాయి. ఈ బ్యాంకుల విలీన ప్రకటన తర్వాత స్టాక్ పరుగు పెట్టింది. మారుతీ సుజుకీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4 నుండి 6 లక్షల సీఎన్జీ కార్లు విక్రయించాలని మారుతీ సుజుకీ లక్ష్యంగా పెట్టుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 2.3 లక్షల సీఎన్జీ కార్లను విక్రయించింది.


Click it and Unblock the Notifications