60,000 దాటిన సెన్సెక్స్, రూ.4.5 లక్షల కోట్లు పెరిగిన సంపద
స్టాక్ మార్కెట్ నేడు (ఏప్రిల్ 4, సోమవారం) పరుగు పెట్టింది. అంతర్జాతీయ సానుకూల అంశాలకు తోడు దేశీయంగా HDFC ట్విన్స్ మెర్జర్ మార్కెట్ దూకుడుకు ప్రధాన కారణమైంది. ఉదయం నుండి మార్కెట్లు లాభాల్లోనే ఉన్నాయి. ఏ దశలోను క్షీణించలేదు. పైగా అంతకంతకూ పైకెగిశాయి. ఉదయం ఓ సమయంలో 1500 పాయింట్ల లాభాల్లో ఉన్న సెన్సెక్స్ మధ్యాహ్నం సమయానికి కాస్త తగ్గినప్పటికీ వెయ్యి పాయింట్లకు పైగా లాభాల్లోనే ఉంది. చివరకు 1335 పాయింట్ల లాభాల్లో ముగిసింది సెన్సెక్స్.
సెన్సెక్స్ ఉదయం59,764 పాయింట్ల వద్ద ప్రారంభమై, 60,845 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 59,760 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ ఏ సమయంలోను కనీసం నిన్నటి స్థాయికి కూడా పడిపోలేదు. నిఫ్టీ 18000 మార్కును దాటింది. 383 పాయింట్లు ఎగిసి 18,053 పాయింట్ల వద్ద ముగిసింది. ఇన్వెస్టర్ల సంపద నేడు ఒక్కరోజే రూ.4.50 లక్షల కోట్లు పెరిగింది. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.272.37 లక్షల కోట్లకు చేరుకుంది.

సెన్సెక్స్ 30 షేర్లలో టైటాన్, ఇన్ఫోసిస్ షేర్లు మాత్రమే నష్టాల్లో ముగిశాయి. HDFC, HDFC బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, హెచ్‌యూఎల్, ఇండస్ఇండ్ బ్యాంకు, టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, సన్ ఫార్మా, నెస్ట్లే, హెచ్‌సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు భారీగా లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్ విలీనం, చమురు ధరలు తగ్గడం, ఎగుమతుల్లో వృద్ధి, కీలక రంగాలు పుంజుకోవటం వంటి అంశాలు మార్కెట్ హవాకు కలిసి వచ్చాయి.


Click it and Unblock the Notifications