700 పాయింట్లు రికవరీ, భారీ నష్టాల నుండి లాభాల్లోకి వచ్చినా..
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ప్రారంభమై, అతి భారీ నష్టాల్లో కదలాడి, చివరకు కాస్త కోలుకొని స్వల్ప నష్టాల్లో ముగిశాయి. చివరి గంటలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో లాభాల్లో ట్రేడ్ అయింది. కానీ అది ఎక్కువ సేపు నిలవలేదు. దీంతో స్వల్ప నష్టాల్లో ముగిసింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు కరోనా భయాలు సూచీలపై ప్రభావితం చూశాయి. లాక్‌డౌన్ భయాలు ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. పైగా ఇప్పటికే విధించిన ఆంక్షలు, లాక్‌డౌన్‌తో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని, దీంతో రికవరీ మరింత ఆలస్యం అవుతుందనే అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. కానీ కీలక రంగాల్లో కనిష్ఠాల వద్ద ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో సూచీలు చివరలో పుంజుకున్నాయి. సెన్సెక్స్ దాదాపు 700 పాయింట్ల మేర నష్టాల నుండి రికవరీ అయింది.

భారీ నష్టాల నుండి స్వల్ప నష్టాల్లోకి...
సెన్సెక్స్ నేడు 48,356.01 పాయింట్ల వద్ద ప్రారంభమై, 48,863.23 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,028.07 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 63.84 (0.13%) పాయింట్లు నష్టపోయి 48,718.52 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఓ సమయంలో దాదాపు 800 పాయింట్లు నష్టపోయింది. ఆ తర్వాత చివరి గంటలో కాస్త పుంజుకొని 80 పాయింట్లు లాభపడింది. కానీ అంతలోనే నష్టాల్లోకి వెళ్లినప్పటికీ స్వల్పంగా 63 పాయింట్ల నష్టంతో ముగిసింది. నిఫ్టీ మాత్రం అతి స్వల్ప లాభాల్లో ముగిసింది. నిఫ్టీ 14,481.05 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,673.85 వద్ద గరిష్టాన్ని, 14,416.25 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 4.29 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 4.12 శాతం, SBI లైఫ్ ఇన్సురెన్స్ 3.22 శాతం, టాటా స్టీల్ 2.97 శాతం, HUL 2.30 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ 4.54 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 2.28 శాతం, రిలయన్స్ 1.78 శాతం, యాక్సిస్ బ్యాంకు 1.70 శాతం, బీపీసీఎల్ 1.38 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, అదానీ పోర్ట్స్, HDFC బ్యాంకు ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.02 శాతం లాభపడగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.56 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఆటో 0.41 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.41 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.41 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.10 శాతం, నిఫ్టీ ఐటీ 0.05 శాతం, నిఫ్టీ మెటల్ 2.16 శాతం, నిఫ్టీ ఫార్మా 0.28 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.20 శాతం, నిఫ్టీ మీడియా 1.35 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.60 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.63 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.11 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications