ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో క్లోజ్ అయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి మార్కెట్లు నష్టాల్లోనే ఉన్నాయి. సెన్సెక్స్ 38.88 పాయింట్లు నష్టపోయి 41,642.66 వద్ద, నిఫ్టీ 5.60 పాయింట్లు కోల్పోయి 12,266.20 వద్ద ముగిసింది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 71.15 వద్ద ట్రేడ్ అయింది.
మార్కెట్లు ముగిసే సమయానికి టాప్ గెయినర్స్ లిస్టులో జీ ఎంటర్టైన్మెంట్, వేదాంత, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, మారుతీ సుజుకీ, హీరో మోటో కార్ప్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో యస్ బ్యాంకు, నెస్ట్లే, కోల్ ఇండియా, రిలయన్స్, ఎస్బీఐ ఉన్నాయి.

మరోవైపు, రిలయన్స్ షేర్లు ఈ రోజు (డిసెంబర్ 23) ట్రేడింగ్‌లో నష్టపోయాయి. ఓ దశలో ఇవి 2.8 శాతం కోల్పోయాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువ 2 బిలియన్ డాలర్ల వరకు హరించుకుపోయింది. సౌదీ ఆరామ్‌కోతో డీల్ నేపథ్యంలో స్వల్ప సమస్యలు వచ్చాయి. దీంతో షేర్లు పడిపోయినట్లుగా భావిస్తున్నారు. క్లోజింగ్ సమయానికి రిలయన్స్ షేర్ 1.76 శాతం లేదా రూ.28.15 తగ్గి రూ.1,570.95 వద్ద ముగిసింది.
ఢిల్లీ కోర్టు రిలయన్స్, బ్రిటిష్ పెట్రోలియం ఆస్తులను వెల్లడించాలని ఇటీవల సూచించింది. కేంద్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. పన్నా ముక్తా, తపతి ఉత్పత్తిలో భాగస్వామ్య ఒప్పందానికి సంబంధించి తమకు చెల్లించాల్సిన రూ.4.5 బిలియన్ డాలర్లను ఈ కంపెనీలు చెల్లించడంలో విఫలమయ్యాయని ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. దీంతో రిలయన్స్ - ఆరామ్‌కో డీల్ ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్లుగా భావిస్తున్నారు. దీంతో షేర్లు పతనమయ్యాయి.


Click it and Unblock the Notifications