లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, 16550 పాయింట్ల పైన ముగిసిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం (ఆగస్ట్ 16) లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 145 పాయింట్లు, నిఫ్టీ 34 పాయింట్ల మేర లాభపడింది. ఉదయం సూచీలు కాస్త తడబడినప్పటికీ మధ్యాహ్నం తర్వాత కోలుకున్నాయి. ఇంట్రాడే గరిష్ఠాలను తాకాయి. ఆసియా సహా అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పవనాలు కనిపించినప్పటికీ భారత సూచీలు మాత్రం ముందుకే సాగాయి. ఆఫ్గన్ సంక్షోభం నేపథ్యంలో ఐరోపా సూచీలు బలహీనంగా ప్రారంభమయ్యాయి. మరోవైపు కరోనా డెల్టా భయాలతో ఆసియా మార్కెట్లు ఒడుదొడుకుల్లో ఉన్నాయి. దీనికి ఆఫ్గన్ సంక్షోభం తోడు కావడం మరింత నష్టాల్లోకి నెట్టింది. అయితే దేశీయంగా ఉన్న సానుకూల పరిణామాలతో సూచీలు అంతర్జాతీయ ప్రతికూల పవనాలను అధిగమించాయి.
ఇంట్రాడేలో 55,680 వద్ద సెన్సెక్స్, 16,589 వద్ద నిఫ్టీ ఆల్ టైమ్ గరిష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 55,479.74 పాయింట్ల వద్ద ప్రారంభమై, 55,680.75 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 55,281.02 పాయింట్ల వద్ద కనిష్టాన్నితాకింది. నిఫ్టీ 16,518.40 పాయింట్ల వద్ద ప్రారంభమై, 16,589.40 వద్ద గరిష్టాన్ని, 16,480.75 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 145.29 (0.26%) పాయింట్లు లాభపడి 55,582.58 పాయింట్ల వద్ద, నిఫ్టీ 33.95 (0.21%) పాయింట్లు ఎగిసి 16,563.05 పాయింట్ల వద్ద ముగిసింది.

నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా స్టీల్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ ఉన్నాయి. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టాటా స్టీల్ 3.95 శాతం, బజాజ్ ఫైనాన్స్ 3.58 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 2.65 శాతం, IOC 2.44 శాతం, బ్రిటానియా 2.12 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో మారుతీ సుజుకీ 2.50 శాతం, శ్రీసిమెంట్స్ 2.34 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 2.19 శాతం, బజాజ్ ఆటో 2.02 శాతం, ఐచర్ మోటార్స్ 2.00 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications