దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం (ఏప్రిల్ 28) భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలకు తోడు హెవీ వెయిట్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ 17200 పాయింట్లకు ఎగువన ముగిసింది.
ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సూచీలు, మధ్యాహ్నం తర్వాత అంతకంతకూ ఎగిశాయి. సెన్సెక్స్ ఉదయం 57,296 పాయింట్ల వద్ద ప్రారంభమై, 57,790 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 56,936 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. క్రితం సెషన్‌లో 56,820 పాయింట్ల వద్ద ముగిసింది. ఏ సమయంలోను నష్టాల్లోకి వెళ్లలేదు. పైగా ఓ సమయంలో దాదాపు 1000 పాయింట్ల లాభాల్లోకి వచ్చింది. చివరకు స్వల్పంగా క్షీణించినప్పటికీ చివరకు 701 పాయింట్లు లాభపడి 57,521 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 206 పాయింట్లు ఎగిసి 17,245 పాయింట్ల వద్ద ముగిసింది.

అన్ని రంగాల్లోకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఎఫ్ఎంసీజీ, పవర్, ఆటో, క్యాపిటల్ గూడ్స్ అదరగొట్టాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా లాభాల్లోనే ముగిశాయి. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,69,47,290 కోట్లకు చేరుకుంది. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో హెచ్‌యూఎల్, HDFC లైఫ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్, యూపీఎల్, ఏషియన్ పేయింట్స్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో బజాజ్ ఆటో, హిండాల్కో, భారతీ ఎయిర్ టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications