భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు, కారణాలు ఇవే..
ముంబై: స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర మందగమనం నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంపై ఫెడ్ రిజర్వ్ బ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది. ఆ ప్రభావం ఆసియా మార్కెట్లపై పడింది. దీంతో భారత్ సహా ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ పరిస్థితిపై ఆందోళన వ్యక్తంకావడం, దేశీయంగా కరోనా కేసులు పెరగడం వంటివి ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. దీంతో మూడు రోజుల పాటు భారీ లాభాల్లో ఉన్న మార్కెట్లు నేడు నష్టపోయాయి.

400 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
సెన్సెక్స్ 394 పాయింట్లు (1.02 శాతం) నష్టపోయి 38,220.39, నిఫ్టీ 96 పాయింట్లు (0.84 శాతం) నష్టపోయి 11,312.20 వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.87 శాతం, 0.72 శాతం ముగిశాయి. బీఎస్ఈ పవర్, యుటిలిటీస్ రెండూ నాలుగు శాతానికి పైగా పెరిగాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఎనర్జీ, టెలికం రంగాలు ఒక శాతానికి పైగా నష్టపోయాయి. డాలర్ మారకంతో రూపాయి 20 పైసలు నష్టపోయి 75 లోపు ముగిసింది.

రిలయన్స్ భారీ నష్టాల్లో..
రిలయన్స్, ఫైనాన్షియల్ షేర్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఎన్టీపీసీ షేర్ లాభపడింది. పవర్ సెక్టార్ మంచి లాభాల్లో పడింది. టాటా పవర్ ఆరు నెలల గరిష్టానికి చేరుకుంది. టాప్ గెయినర్స్ జాబితాలో ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్ప్, బీపీసీఎల్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంకు, విప్రో, టైటాన్ కంపెనీ ఉన్నాయి. ఫైనాన్షియల్, ఆటో, ప్రయివేట్, బ్యాంకు షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

కారణాలివే..
అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఫెడ్ రిజర్వ్ ఆందోళన వ్యక్తం చేయడం, కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈక్విటీ మార్కెట్లపై ప్రభావం చూపింది. దక్షిణ కొరియా, చైనా, హాంగ్‌కాంగ్, జపాన్ మార్కెట్లు కూడా నష్టాల్లో ముగిశాయి. బుధవారం విదేశీ పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్లు(FPI)లు రూ.459 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా, దేశీ ఫండ్స్ (DII)లు రూ.97 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. మంగళవారం FPIలు రూ.1135 కోట్లను ఇన్వెస్ట్ చేయగా, డీఐఐలు రూ.379 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి.


Click it and Unblock the Notifications