భారీ నష్టాల నుండి... ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు: రూ.825 దిగువకు పేటీఎం స్టాక్
స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల నుండి లాభాల్లోకి వచ్చాయి. ఈ వారం మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనప్పటికీ, మధ్యాహ్నం నాటికి కాస్త పుంజుకుంది. నేడు అంతర్జాతీయ మార్కెట్లకు సెలవు. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఆసియా మార్కెట్లపై ప్రభావం కనిపించింది. అయితే వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చలకు జోబిడెన్ అంగీకరించడం, ఈ నెల 24న అమెరికా-రష్యా విదేశాంగ మంత్రుల భేటీ జరగనుండటం కొంత సానుకూల పరిణామం.
ఈ వివాదానికి ఓ పరిష్కారం లభించే అవకాశముందన్న అంచనాలు ఉన్నాయి. ఇది మార్కెట్లకు సానుకూలంగా కనిపించాయి. దీంతో ఉదయం భారీ నష్టాల నుండి మధ్యాహ్నం లాభాల్లోకి వచ్చాయి.

మార్కెట్ నష్టాల నుండి లాభాల్లోకి...
సరిహద్దుల్లో రష్యా మోహరింపు, సైన్యం సన్నద్ధత శరవేగంగా కనిపిస్తోంది. ఇది ఇన్వెస్టర్ల అప్రమత్తతకు కారణమైంది. అందుకే మార్కెట్లు లాభాల్లో కనిపించినప్పటికీ, అది అతి స్వల్పమే. అంతర్జాతీయ అంశాలు సానుకూలంగా కనిపిస్తున్నప్పటికీ రష్యా ధోరణి మార్కెట్ పైన ప్రభావం కనిపిస్తోంది. ముడి చమురు ధరలు, ఎఫ్ఐఐల అమ్మకాలు, ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్ట్స్ గడువు తీరనుండటం ఈ వారం ట్రేడింగ్ పైన ప్రభావం చూపే అవకాశముంది. ఎల్ఐసీ ఐపీవోలో వేగం కనిపిస్తుండటంతో ఈక్విటీ మార్కెట్లో స్వల్ప దిద్దుబాటు ఉండవచ్చునని భావిస్తున్నారు.

58,000 పాయింట్లను దాటి..
సెన్సెక్స్ నేడు 57,551 పాయింట్ల వద్ద ప్రారంభమై, 58,040 వద్ద గరిష్టాన్ని, 57,167 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ ఓ సమయంలో దాదాపు 700 పాయింట్ల మేర నష్టపోయింది. కానీ ఆ తర్వాత లాభాల్లోకి వచ్చింది. 200 పాయింట్లు లాభపడి 58,000 పాయింట్లను క్రాస్ చేసింది. మధ్యాహ్నం గం.12.30 సమయానికి 103 పాయింట్లు లాభపడి 57,936 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 17 పాయింట్లు లాభపడి 17,293 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ ఉదయం 17,070 పాయింట్ల స్థాయికి పడిపోయింది. నేడు 17,327 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది.

పేటీఎం రూ.825 దిగువకు..
పేటీఎం స్టాక్ ధర నేడు 1 శాతానికి పైగా నష్టపోయింది. గత ఏడాది నవంబర్ నెలలో పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ఐపీవోకు వచ్చింది. ఇష్యూ ధర రూ.2000కు పైనే ఉండగా, అడపాదడపా స్వల్ప లాభాలు మినహా, పేటీఎం స్టాక్ ఎప్పటికప్పుడు అంతకంతకూ దిగజారుతోంది. రూ.2000 స్థాయి నుండి ఇప్పుడు రూ.825కు పడిపోయింది. మధ్యాహ్నం గం.12.37 సమయానికి పేటీఎం 1.25 శాతం క్షీణించి రూ.823కు పడిపోయింది. ఆరు నెలల్లో దాదాపు 50 శాతం, నెలలో దాదాపు 15 శాతం, ఐదు రోజుల్లో 2 శాతానికి పైగా నష్టపోయాయి.


Click it and Unblock the Notifications