ఎన్నికల ఫలితాల వైపు చూపు, సెన్సెక్స్ 1100 పాయింట్లకు పైగా జంప్
దేశీయ స్టాక్ మార్కెట్లు దుమ్మురేపుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసే ధోరణి, చమురు ధరల తగ్గుదల సహా అంతర్జాతీయ సానుకూల సంకేతాలకు తోడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఎక్కువగా బీజేపీ వైపు మొగ్గు చూపడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. ప్రధానంగా రాజకీయంగా దేశానికి గుండెకాయలా భావించే ఉత్తర ప్రదేశ్‌లో మళ్లీ బీజేపీ అధికారం చేపట్టే దిశగా ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే, ఉక్రెయిన్-రష్యా మధ్య సంధి యత్నాలు జరుగుతున్నాయి. ఇరు దేశాల ప్రతినిధులు టర్కీలో భేటీ కానున్నారు. చమురు ధరలు తగ్గడంతో పాటు ఇరాక్, యూఏఈ సహా ఒపెక్ దేశాల నుండి అదనపు చమురు అందుబాటులోకి రానుందనే వార్తలు స్టాక్ మార్కెట్ పైన సానుకూల ప్రభావం చూపాయి.
ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రకటన తర్వాత నిన్న అమెరికా, ఐరోపా మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. నేడు ఆసియా-పసిఫిక్ మార్కెట్లు, యూఎస్ ఫ్యూచర్ సైతం సానుకూలంగా ఉన్నాయి. ఈ పరిణామాలు దేశీయ సూచీలను ఉదయం సెషన్‌లో ముందుకు నడిపిస్తున్నాయి. సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో దాదాపు అన్ని కూడా లాభాల్లో ఉన్నాయి. ఇటీవల 53,000 స్థాయికి పడిపోయిన సెన్సెక్స్ ఇప్పుడు 55,600 పాయింట్లు క్రాస్ చేసింది. ఓ సమయంలో ఆల్ టైమ్ గరిష్టానికి 10,000 పాయింట్ల దూరంలో ఉన్న సెన్సెక్స్ ఇప్పుడు 7000 పాయింట్ల దిగువకు వచ్చింది.

సెన్సెక్స్ 56,242 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 56,2452 పాయింట్ల వద్దనే గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 16,757 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. గరిష్టం కూడా ఇదే. ఉదయం గం.9.50 సమయానికి సెన్సెక్స్ 1111 పాయింట్లు ఎగిసి 55,758 పాయింట్ల వద్ద, నిఫ్టీ 321 పాయింట్లు ఎగిసి 16,667 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications