ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం(సెప్టెంబర్ 11) స్వల్పనష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.20 సమయానికి సెన్సెక్స్ 82.88 పాయింట్లు లేదా 0.21 శాతం తగ్గి 38,757.44 వద్ద, నిఫ్టీ 15.50 పాయింట్లు లేదా 0.14 శాతం తగ్గి 11,433.80 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత స్వల్ప లాభాల్లోకి వచ్చి, మళ్లీ స్వల్ప నష్టాల్లోకి వెళ్లింది. మొత్తానికి మార్కెట్లు ఊగిసలాటలో ఉన్నాయి.
భారతీ ఇన్ఫ్రాటెల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టైటాన్ కంపెనీలు భారీగా ఎగిశాయి. అంబర్ ఎంటర్ప్రైజెస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, HDFC బ్యాంకు యాక్టివ్ స్టాక్స్‌గా ఉన్నాయి. అన్ని రంగాల షేర్లు కూడా స్వల్పలాభాల్లో ఉన్నాయి. విదేశీ మారకం డాలర్ వ్యాల్యూతో రూపాయి 2 పైసలు నష్టపోయి 73.48 వద్ద ప్రారంభమైంది.

ఐటీ స్టాక్స్ జూమ్, మ్యాక్స్ హెల్త్ కేర్ అదరగొట్టింది
ఐటీ స్టాక్స్ భారీ లాభాల్లో ఉన్నాయి. టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ వంటి దిగ్గజ ఐటీలు 0.5 శాతం నుండి 3 శాతం వరకు లాభపడ్డాయి. ఇతర కంపెనీల విషయానికి వస్తే టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఆటో, సన్ ఫార్మా, ఎస్బీఐ, మారుతీ, రిలయన్స్ ఉన్నాయి. మ్యాక్స్ హెల్త్ కేర్ ఏకంగా 15 శాతం ఎగబాకి రూ.128 పలికింది. టాప్ గెయినర్స్ జాబితాలో విప్రో, భారతీ ఇన్ఫ్రాటెల్, గ్రాసీమ్, టెక్ మహీంద్రా, టీసీఎస్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఇండస్ ఇండ్ బ్యాంకు, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, ఐవోసీ, ఏషియన్ పేయింట్స్, శ్రీ సిమెంట్స్ ఉన్నాయి.

అందుకే లాభాల్లోకి...
భారత్-చైనా సరిహద్దు ప్రతిష్టంభనపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టమైన ప్రకటన చేశారు. అలాగే దేశంలో కరోనా రికవరీ రేటు పెరుగుతోంది. దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అయితే ఆసియా మార్కెట్లు లాభాల్లో కొనసాగుతుండటం కూడా మన మార్కెట్లపై ప్రభావం చూపింది.

నష్టాల్లో అంతర్జాతీయ మార్కెట్లు
ఈరోజు జపాన్ నిక్కీ 150 పాయింట్లు లేదా 0.65 శాతం ఎగిసింది. చైనా మార్కెట్లు కూడా లాభాల్లోనే ఉన్నాయి. అయితే క్లోజింగ్ సమయానికి అంతర్జాతీయ మార్కెట్లు అంతకుముందు నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. డౌజోన్స్ 1.45 పాయింట్లు క్షీణించగా, నాస్‌డాక్ 2 శాతం నష్టపోగా, ఎస్ అండ్ పీ 1.76 శాతం నష్టంతో ముగిశాయి. నెట్ ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, అమెజాన్ ఢీలా పడ్డాయి. వీటి షేర్లు దాదాపు 3 శాతం నుండి 4శాతం మధ్య నష్టపోయాయి.


Click it and Unblock the Notifications