భారీ ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు: రిలయన్స్ స్టాక్ దెబ్బ
స్టాక్ మార్కెట్లు గురువారం (మార్చి 31) లాభాల్లో ప్రారంభమై, మధ్యాహ్నం సమయానికి నష్టాల్లోకి వెళ్లాయి. మొత్తానికి మార్కెట్లు ఊగిసలాటలో ఉన్నాయి. సెన్సెక్స్ క్రితం సెషన్‌లో 58,684 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు స్వల్పంగా లాభపడి 58,779 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 58,890 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 58,550 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నేడు ఏ సమయంలోను కనీసం 59,000 మార్కును తాకలేదు. నిఫ్టీ కూడా 17,519 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,559 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,464 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12.30 సమయానికి సెన్సెక్స్ 52 పాయింట్లు క్షీణించి 58,631 పాయింట్ల వద్ద, నిఫ్టీ 13 పాయింట్లు క్షీణించి 17,485 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
ఫార్మా రంగం మినహా అన్ని రంగాలు కూడా లాభాల్లోనే ఉన్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్ ఒక శాతం మేర లాభపడింది. బ్యాంకింగ్ సూచీ 0.5 శాతం ఎగిసిపడింది. టెలికం రంగం భారీ లాభాల్లో ఉంది. నేడు రిలయన్స్ స్టాక్ సూచీలను కిందకు లాగింది. క్రితం సెషన్‌లో రూ.2673 వద్ద ముగిసిన ఈ స్టాక్ నేడు రూ.2665 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత అంతకంతకూ క్షీణించి 1 శాతానికి పైగా నష్టాల్లో ఉంది.

రష్యా దళాలు కీవ్ శివార్లపై విరుచుకుపడుతున్నాయి. ఇది ప్రపంచ మార్కెట్ పైన ప్రభావం చూపుతోంది. బుధవారం అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లోనే ఉన్నాయి. జపాన్, హాంగ్‌కాంగ్, తైవాన్ సూచీలు నష్టాల్లో ఉండగా, కొరియా మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపై కనిపించింది. మధ్యాహ్నం నాటికి టాప్ గెయినర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యు స్టీల్, ఐవోసీ, టాటా కన్స్యూమర్, ఓఎన్జీసీ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో హిండాల్కో, దివిస్ ల్యాబ్స్, రిలయన్స్, సిప్లా, HDFC లైఫ్ ఉన్నాయి. సరేగామా స్టాక్ 5 శాతానికి పైగా లాభపడి అప్పర్ సర్క్యూట్‌ను తాకింది.


Click it and Unblock the Notifications