భారీ లాభాల్లో మార్కెట్: ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో సహా ఐటీ స్టాక్స్‌కు ట్రంప్ దెబ్బ
ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం (4, ఆగస్ట్) లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 199.93 పాయింట్లు (0.54%) ఎగిసి 37,139.53 వద్ద, నిఫ్టీ 59.50 పాయింట్లు (0.55%) పెరిగి 10,951.10 వద్ద ప్రారంభమైంది. ప్రారంభంలో 708 షేర్లు లాభాల్లో, 184 షేర్లు నష్టాల్లో, 37 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. మధ్యాహ్నం గం.12.38 సమయానికి సెన్సెక్స్ 621.67 (1.68%) పాయింట్లు ఎగిసి 37,561.27 వద్ద ట్రేడ్ అయింది. డాలర్ మారకంతో రూపాయి 75.15 వద్ద ప్రారంభమైంది. నిన్న 75.01 వద్ద ముగిసింది. 14 పైసల నష్టంతో ప్రారంభమైంది.

ట్రంప్ కీలక నిర్ణయం.. నష్టాల్లో ఐటీ స్టాక్స్
అమెరికా అధ్యక్షులు ట్రంప్ హెచ్1బీ వీసాలపై కీలక నిర్ణయం తీసుకోవడంతో ఐటీ షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. టెక్ మహీంద్రా, విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, మైండ్ ట్రీ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. హెచ్1బీ వీసాల ద్వారా అమెరికా ఫెడరల్ ఏజెన్సీల్లో చేపట్టబోయే నియామకాలను నిషేధించారు. ఈ ప్రభావం ఎక్కువగా ఇండియా టెక్ ఉద్యోగులపై పడనుంది.

టాప్ గెయినర్స్, లూజర్స్
మధ్యాహ్నం సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో జీ ఎంటర్టైన్మెంట్, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హీరో మోటో కార్ప్, మారుతి సుజుకీ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో బీపీసీఎల్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఇన్ఫోసిస్ ఉన్నాయి.

అందుకే లాభాల్లోకి..
మార్కెట్లు నిన్న భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 667 పాయింట్లు, నిఫ్టీ 182 పాయింట్ల నష్టంతో ముగిశాయి. ఈ రోజు అందుకు భిన్నంగా మంచి లాభాల్లో ఉన్నాయి. నిన్న యూరోపియన్ మార్కెట్లు కాస్త సానుకూల ధోరణిలో ముగిశాయి. ఈ ప్రభావం ఈ రోజు మన మార్కెట్లపై పడింది. దీంతో రెండు రోజుల వరుస అమ్మకాల తర్వాత ఈ రోజు పుంజుకున్నాయి. ముఖ్యంగా ఆటో, బ్యాంకింగ్ రంగాల షేర్లకు డిమాండ్ పెరిగింది. జూలైలో ఆటో సేల్స్ సానుకూలంగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్ఎస్ఈలో మీడియా, ప్రయివేటు బ్యాంక్స్, ఆటో, రియాల్టీ, మెటల్, ఎఫ్ఎంసీజీ షేర్లు మూడు శాతం వరకు లాభపడ్డాయి. ఐటీ షేర్లు 0.7 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ షేర్లు 0.4 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications