ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం (అక్టోబర్ 13) లాభాల్లో ప్రారంభమయ్యాయి. వరుసగా ఎనిమిది రోజుల పాటు లాభాలు నమోదు చేసిన మార్కెట్లు, తొమ్మిదో రోజు లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 81.19 పాయింట్లు(0.20%) లాభపడి 40,512.61 పాయింట్ల వద్ద, నిఫ్టీ 25.40 పాయింట్లు(0.21%) ఎగిసి 11,905.60 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.
ఉదయం గం.11 సమయానికి సెన్సెక్స్ 140 పాయింట్లు లాభపడి 40,734 పాయింట్లను తాకింది. సెన్సెక్స్, పైకి, కిందకు కదలాడింది. 390 షేర్లు లాభాల్లో, 447 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 52 షేర్లలో ఎలాంటి మార్పులేదు. బ్యాంకింగ్ రంగం మినహా అన్ని రంగాలు లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. రెండు రోజులుగా భారీ లాభాలు నమోదు చేసిన బ్యాంకింగ్ షేర్లు నేడు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

లక్ష్మీ విలాస్ బ్యాంకు షేర్లు అప్
సంక్షోభంలో చిక్కుకున్న లక్ష్మీ విలాస్ బ్యాంకు షేర్లు ప్రారంభ ట్రేడింగ్‌లో 5 శాతం లాభపడ్డాయి. రైట్స్ బేసిస్ ఆధారిత సెక్యూరిటీస్‌ను జారీ చేసే అంశాన్ని బోర్డు పరిశీలిస్తుందని వార్తలు రావడంతో ఈ షేర్ ధర పెరిగింది. 15వ తేదీన బోర్డు సమావేశం జరగనుంది.
ఉదయం గం.10.40 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో అల్ట్రా టెక్ సిమెంట్, శ్రీ సిమెంట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, గ్రాసీమ్, సిప్లా ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ఐసీఐసీఐ బ్యాంకు, గెయిల్, బజాజ్ ఫైనాన్స్, ఐవోసీ, టాటా మోటార్స్ ఉన్నాయి.
యాక్టివ్ స్టాక్స్‌లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, రిలయన్స్, భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, సిప్లా ఉన్నాయి.

ఒత్తిడిలో బ్యాంకింగ్ రంగం
నేడు సిమెంట్ స్టాక్స్ భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. అల్ట్రా టెక్ సిమెంట్ టాప్ గెయినర్‌గా నిలిచింది.
రెండు రోజుల బాటు భారీ లాభాలను చూడటంతో పాటు, ఈ రోజు కొన్ని బ్యాంకుల ఫలితాలు ఉన్నాయి. దీంతో బ్యాంకింగ్ రంగం ఒత్తిడిలో ఉంది.
ఈ రోజు కర్ణాటక బ్యాంకు ఫలితాలు ఉన్నాయి. ఇతర రంగాల విషయానికి వస్తే విప్రో, టాటా స్టీల్ కూడా ఫలితాలను ప్రకటించవచ్చు.
వేదాంత డీలిస్టింగ్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ షేర్ ధర నిన్నటి వరకు నష్టాల్లో కొనసాగింది. ఈ రోజు ఈ స్టాక్స్ లాభాల్లో ఉన్నాయి.
రిలయన్స్ షేర్ 0.49 శాతం ఎగిసి రూ.2,248 వద్ద ట్రేడ్ అయింది.
డాలర్ మారకంతో రూపాయి 13 పైసలు క్షీణించి 73.40 వద్ద ప్రారంభమైంది. నిన్న రూపాయి 73.27 వద్ద క్లోజ్ అయింది.

ఐటీ స్టాక్స్...
గతవారం విడుదలైన టీసీఎస్ త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో పాటు తదుపరి త్రైమాసికం పుంజుకుంటామని ప్రకటించింది. ఇది ఐటీ స్టాక్స్ లాభపడేందుకు దోహదపడింది. ఐటీ స్టాక్స్‌లో టీసీఎస్ 0.32 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.29 శాతం, ఇన్ఫోసిస్ స్టాక్స్ 0.79 శాతం, టెక్ మహీంద్ర స్టాక్స్ 0.28 శాతం, మైండ్ ట్రీ స్టాక్స్ 1.07 శాతం లాభడ్డాయి. ఐటీ స్టాక్స్‌లో విప్రో (0.13 శాతం), కోఫోర్జ్ (0.13 శాతం) మాత్రమే నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.

మందకోడిగా ఆసియా మార్కెట్లు
మారటోరియం కాలంలో వడ్డీ చెల్లించే అంశానికి సంబంధించి ఈ రోజు సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. ఇన్వెస్టర్లు ఈ అంశంపై దృష్టి సారించారు. అమెరికా సూచీలు స్వల్పంగా లాభాల్లో ముగిశాయి. దీంతో ఆసియా మార్కెట్లు ఈ రోజు మందకోడిగా కొనసాగుతున్నాయి. జపాన్ నిక్కీ 0.14 శాతం,, హాంగ్‌కాంగ్ హాంగ్‌షెంగ్ 2.20 శాతం, సింగపూర్ స్ట్రైట్స్ టైమ్స్ 0.34 శాతం స్వల్ప లాభాల్లో ఉన్నాయి. తైవాన్ వెయిటెడ్ నష్టాల్లో కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications