Bull Market: సోమవారం ప్రారంభం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ ర్యాలీకి తెరలేపాయి. ఆరంభంలో కొంత తటపటాయించిన మార్కెట్లు క్రమంగా బుల్స్ చేతిలో మరింత ముందుకు సాగాయి.
కొత్త వారం మెుదటి రోజున బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్-నిఫ్టీలు సరికొత్త గరిష్ఠాలను తాకాయి. ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ సూచీ 74,797.70 పాయింట్లను చేరుకుని సరికొత్త 52 వారాల గరిష్ఠ స్థాయిని చేరుకుంది. మార్కెట్లు ఇలాగే కొనసాగితే నేడు సూచీ మరింతగా లాభపడొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో 22,684 పాయింట్ల మార్కును తాకి సరికొత్త 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరుకుంది.

విస్తృత మార్కెట్‌లోనూ కొనుగోళ్లు కనిపించాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పెరిగింది. వాస్తవానికి నేడు అమెరికాతో పాటు ఆసియాలోని ఇతర మార్కెట్ల నుంచి సానుకూల సూచనలతో దేశీయ మార్కెట్లలో కొనుగోళ్ల కోలాహలం కొనసాగుతోంది. రంగాల వారీగా పరిశీలిస్తే.. నిఫ్టీ ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్ మినహా అన్ని రంగాల సూచీలు సానుకూలంగా ఉన్నాయి. ప్రధానంగా నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఆటో టాప్ సెక్టోరల్ గెయినర్లుగా నిలిచి ఒక్కొక్కటి 2 శాతానికి పైగా పెరిగాయి. దీంతో రియల్టీ, ఆటో రంగాల్లోని షేర్లు ర్యాలీని ముందుండి నడిపిస్తున్నాయి.
వీటికి తోడు దేశీయ స్టాక్ మార్కెట్లలోని పెట్టుబడిదారులు దేశంలో బలమైన Q4 కార్పొరేట్ లాభాల అంచనాలను కలిగి ఉన్నారని మెహతా ఈక్విటీస్ సీనియర్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే అన్నారు. వీటికి తోడు అమెరికాకు సంబంధించిన కీలక డేటా వెలువడనున్న వేళ భారతీయ ఇన్వెస్టర్లు వాటిని ట్రాక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 1.18 గంటల సమయంలో సెన్సెక్స్ సూచీ 611 పాయింట్ల లాభంలో ఉండగా.. నిఫ్ట సూచీ 180 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 195, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 209 పాయింట్ల మేర లాభంతో కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలో నిఫ్టీ సూచీలో ఐషర్ మోటార్స్, మారుతీ సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ స్టాక్స్ టాప్ గెయినర్లుగా కొనసాగుతుండగా.. అదానీ పోర్ట్స్, అపోలో హాస్పిటల్, నెస్లే, అదానీ ఎంటర్‌ప్రైజెస్, సన్ ఫార్మాస్యూటికల్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications