జీడీపీ ఎఫెక్ట్: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై: గత క్వార్టర్‌లో వృద్ధి రేటు 5 శాతానికి పడిపోయింది. తదుపరి క్వార్టర్‌లో కూడా వృద్ధి అంతకంటే తగ్గుతుందని అంచనాలు ఉన్నాయి. జీడీపీ డేటా విడుదలకు ముందు శుక్రవారం మార్కెట్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు, టాటా స్టీల్స్ సహా వివిధ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పడిపోయాయి.
జీడీపీ డేటా విడుదలతో పాటు దేశీయ, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో ఉదయం నుంచి మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. మధ్యాహ్నం గం.1.25 సమయానికి సెన్సెక్స్ 365 పాయింట్లు నష్టపోయి 40,768 వద్ద ట్రేడ్ అయింది. ఓ దశలో దాదాపు 400 పాయింట్లు కోల్పోయింది. జీడీపీ 5 శాతం లోపు నమోదవుతుందని అంచనాలు ఉన్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

నేటి ఉదయం మార్కెట్లో భారీగా నష్టపోయిన వాటిల్లో యస్ బ్యాంకు ఉంది. ఆ తర్వాత భారతీ ఎయిర్ టెల్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంకు ఉన్నాయి. టాటా స్టీల్స్, ఐసీఐసీఐ బ్యాంకు, కొటక్ బ్యాంకు, ఇన్ఫోసిస్ కూడా నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. రంగాలవారీగా చూస్తే ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగాలు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.
దేశీయ, అంతర్జాతీయ పరిణామాలకు తోడు అమెరికా - చైనా మధ్య వాణిజ్య ఒప్పందం జాప్యం అయ్యే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఈ పరిణామాల వల్లే మార్కెట్లు భారీ నష్టాల దిశగా వెళ్తున్నట్లుగా చెబుతున్నారు.


Click it and Unblock the Notifications