భారీ నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్, ఎందుకంటే: రిలయన్స్, ఇన్ఫోసిస్, ఫార్మా అదుర్స్
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (డిసెంబర్ 21) ఉదయం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఉదయం గం.10.30 సమయానికి స్వల్ప లాభాల్లోకి వచ్చింది. గతవారం సెన్సెక్స్ 46,960 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు ఉదయం గం.09:17 సమయానికి సెన్సెక్స్ 174.31 పాయింట్లు(0.37%) క్షీణించి 46,786.38 పాయింట్ల వద్ద, నిఫ్టీ 56.20 పాయింట్లు(0.41%) పడిపోయి 13704.30 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 648 షేర్లు లాభాల్లో, 837 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 79 షేర్లలో ఎలాంటి మార్పులేదు. డాలర్ మారకంతో రూపాయి 18 పైసలు పెరిగి 73.75 వద్ద ప్రారంభమైంది. క్రితం వారం 73.57 వద్ద ముగిసింది.

అందుకే నష్టాల్లో మార్కెట్లు
దేశీయ మార్కెట్లు ప్రారంభంలో భారీగా నష్టపోవడానికి ప్రధాన కారణం కొత్త రకం కరోనా వైరస్ వెలుగు చూడటమే. బ్రిటన్, అమెరికా వంటి దేశాల్లో కొత్త రకం వైరస్ భయాన్ని కలిగిస్తోంది. దీంతో ఐరోపా దేశాలు మళ్లీ ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఆసియా మార్కెట్లపై ఈ ప్రభావం పడింది. దీంతో భారత్ మార్కెట్లు కూడా నష్టాల్లో ప్రారంభమయ్యాయి. బ్రిటన్ నుండి రాకపోకలపై నిషేధం విధించాయి.

రిలయన్స్, ఇన్ఫోసిస్ జూమ్
ఉదయం ఫార్మా రంగం మినహా మిగతా అన్ని రంగాలు నష్టాల్లో కనిపించాయి. సిప్లా, సన్ ఫార్మా వంటి ఫార్మా స్టాక్స్ లాభాల్లో ఉన్నాయి. ఉదయం గం.11 సమయానికి సిప్లా 2.04 శాతం, లార్సన్ 1.98 శాతం, HCL టెక్ 1.96 శాతం, సన్ ఫార్మా 1.57 శాతం, ఇన్ఫోసిస్ 1.45 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా 2.66 శాతం, ONGC 2.07 శాతం, గెయిల్ 2.12 శాతం, టాటా మోటార్స్ 2.02 శాతం, దివిస్ ల్యాబ్స్ 1.93 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, లార్సన్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఇన్ఫోసిస్ ఉన్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ నేడు 0.71 శాతం లాభపడి రూ.2005 వద్ద ట్రేడ్ అయింది. ఈ స్టాక్ రూ.2000ను క్రాస్ చేసింది. ఇన్ఫోసిస్ స్టాక్ రూ.1200 క్రాస్ చేసింది.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.08 శాతం, మిడ్ క్యాప్ 0.37 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఆటో 1.21 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.83 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.09 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.52 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.27 శాతం, నిఫ్టీ మెటల్ 0.78 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.77 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.74 శాతం నష్టపోయాయి.
నిఫ్టీ ఐటీ 0.91 శాతం, నిఫ్టీ మీడియా 0.09 శాతం, నిఫ్టీ ఫార్మా 0.53 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.44 శాతం లాభపడ్డాయి.


Click it and Unblock the Notifications