ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు, ఎల్ఐసీ షేర్ ధర @ రూ.832
స్టాక్ మార్కెట్లు బుధవారం (మే 25) లాభాల్లో ప్రారంభమైనప్పటికీ, ఊగిసలాటలో కనిపిస్తున్నాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా ముగిశాయి. అక్కడి టెక్ స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. స్నాప్ షాట్ నిన్న ఒక్కరోజే ఏకంగా 43 శాతం కుంగింది. నేడు ఆసియా మార్కెట్లు కూడా సానుకూలంగా కదలాడాయి. ఈ ప్రభావం సూచీలపై కనిపిస్తోంది.
సెన్సెక్స్ క్రితం సెషన్‌లో 54,052 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు 200 పాయింట్లకు పైగా లాభపడి 54,254 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 54,379 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 54,016 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మొత్తానికి సూచీ లాభనష్టాల ఊగిసలాట మధ్య ఉంది. మధ్యాహ్నం గం.11.35 సమయానికి సెన్సెక్స్ 30 పాయింట్లు క్షీణించి 54,023 పాయింట్ల వద్ద కదలాడింది. నిఫ్టీ 15 పాయింట్లు తగ్గి 16,110 పాయింట్ల వద్ద కనిపించింది.

ఏడాదికి 20 లక్షల మెట్రిక్ టన్నుల సన్ ఫ్లవర్, మరో 20 లక్షల మెట్రిక్ టన్నుల సోయాబీన్ నూనెల దిగుమతులపై కస్టమ్స్ సుంకం, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్‌లను తొలగిస్తున్నట్లు ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఇది ఎఫ్ఎంసీజీ కంపెనీల స్టాక్స్ పైన ప్రభావం చూపుతుంది. గత కొంతకాలంగా ఐటీ రంగం బలహీనంగా కదలాడుతోంది. ఎల్ఐసీ షేర్ ధర నేడు 1 శాతం మేర లాభపడి రూ.832 వద్ద ట్రేడ్ అవుతోంది.