వరుసగా ఆరు రోజుల పాటు లాభాల్లో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు ఈ రోజు (గురువారం, జూన్ 4) ఉదయం ఊగిసలాటలో కనిపించాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 135.22 పాయింట్లు లేదా 0.40 శాతం ఎగిసి 34,244.76 వద్ద, నిఫ్టీ 38.80 పాయింట్లు లేదా 0.39% లాభపడి 10,100.30 వద్ద ప్రారంభమైంది. 631 షేర్లు లాభాల్లో, 218 షేర్లు నష్టాల్లో, 45 షేర్లలో మార్పు లేదు.
అయితే మార్కెట్లు ఆ తర్వాత స్వల్ప నష్టాల్లోకి వెళ్లాయి. ఉదయం గం.11.12 సమయానికి సెన్సెక్స్ 52 పాయింట్ల నష్టాల్లో ఉంది. వంద పాయింట్లకు పైగా లాభాలతో ప్రారంభం కాగా, ఈ ఏడో రోజు కూడా మంచి లాభాలు మూటగట్టుకుంటాయని భావించారు. కానీ కార్పోరేట్ ఫలితాలు, కరోనా మహమ్మారి వ్యాప్తి మార్కెట్ సెంటిమెంటును ప్రభావితం చేశాయి.

ఈ రోజు పదిహేను కంపెనీలు త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తాయి. ఇందులో డీఎల్ఎఫ్, పీఐ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు ఉన్నాయి. అదే సమయంలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ నాలుగు కోట్ల షేర్లను విక్రయించింది. ఈ ప్రభావం కూడా మార్కెట్ పైన కనిపించింది. అంతర్జాతీయ, ఆసియా మార్కెట్లు కొంత సానుకూలంగా ఉన్నాయి. ఎస్ అండ్ పీ 500, నాస్‌డాక్ లాభాల్లో ముగిశాయి. చమురు ధరలు తిరిగి బ్యారెల్ 40 డాలర్లకు చేరుకుంది.
మధ్యాహ్నం గం.11.15 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో వేదాంత, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, బీపీసీఎల్, సిప్లా ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ, కొటక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, ఏషియన్ పేయింట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ఉన్నాయి.


Click it and Unblock the Notifications