600 పాయిట్లు పతనమైన సెన్సెక్స్, మార్కెట్ నష్టాలకు కారణాలెన్నో
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు (మార్చి 24, బుధవారం) భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత అంతకంతకూ దిగజారి 600 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడ్ అయింది సెన్సెక్స్. అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఈ ప్రభావం ఆసియా, భారత మార్కెట్లపై పడింది. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ఫ్యూచర్ దాదాపు 40 పాయింట్ల దిగువన ట్రేడ్ అయింది. వీటితో పాటు దేశీయంగా కీలక కంపెనీల షేర్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. విద్యుత్, యుటిలిటీస్, హెల్త్ కేర్ మినహా అన్ని రంగాలు నష్టాల్లో ఉన్నాయి.

సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో..
నిన్న 50వేల పాయింట్లకు పైగా ముగిసిన సెన్సెక్స్ నేడు ఓ సమయంలో 49వేల స్థాయికి పడిపోయింది. మధ్యాహ్నం సమయానికి 49,500 పాయింట్ల దిగువనే ఉంది. సెన్సెక్స్ 49,786.47 పాయింట్ల వద్ద ప్రారంభమై, 49,854.58 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,253.36 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12 సమయానికి సెన్సెక్స్ 586.00 (1.17%) పాయింట్లు క్షీణించి 49,465 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 14,712.45 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,752.35 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,579.05 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12.15 సమయానికి నిఫ్టీ -165.50 (1.12%) పాయింట్లు క్షీణించి 14,649 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ ఓ సమయంలో 600 పాయింట్లకు పైగా నష్టపోయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, రిలయన్స్, టాటా స్టీల్, SBI ఉన్నాయి.
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో సిప్లా 1.93 శాతం, ఏషియన్ పేయింట్స్ 1.68 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 1.44 శాతం, సన్ ఫార్మా 1.18 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 0.92 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ONGC 3.55 శాతం, హిండాల్కో 3.56 శాతం, టాటా స్టీల్ 3.60 శాతం, SBI 2.48 శాతం, గెయిల్ 2.49 శాతం నష్టపోయాయి.
రిలయన్స్ స్టాక్ నేడు మధ్యాహ్నం 1.26 శాతం నష్టపోయి 26.40 వద్ద ట్రేడ్ అయింది.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 1.13 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.09 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో 1.37 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.83 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.93 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.63 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.44 శాతం, నిఫ్టీ ఐటీ 0.71 శాతం, నిఫ్టీ మీడియా 1.00 శాతం, నిఫ్టీ మెటల్ 2.28 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.47 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.32 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.69 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఫార్మా 1.10 శాతం లాభపడ్డాయి.

కారణాలెన్నో
ఇటీవల సెకండ్ వేవ్ నేపథ్యంలో కరోనా కేసులు పెరగడం, అంతర్జాతీయంగా ఇదే పరిస్థితి ఉండటం మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీసింది. ఉత్తర కొరియా రెండు షార్ట్ రేంజ్ మిసైల్స్ ప్రయోగించినట్లు అమెరికా, దక్షిణ కొరియాలు ప్రకటించాయి. భౌగోళిక ఆందోళనలు ఇన్వెస్టర్లను కలవరానికి గురి చేశాయి. అంతర్జాతీయంగా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. బ్యాంకుల్లో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‍కు సిద్ధమయ్యారు.


Click it and Unblock the Notifications