మూడ్రోజుల లాభాలకు బ్రేక్, ఎందుకంటే: రూ.8 లక్షల కోట్లకు ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్
స్టాక్ మార్కెట్ ర్యాలీకి బ్రేక్ పడింది. ఈ వారంలో మొదటి సెషన్‌లో (సోమవారం) సూచీలు భారీగా నష్టపోయాయి. అయితే ఆ తర్వాత వరుసగా మూడు సెషన్లు లాభపడ్డాయి. అయితే నేడు ఆ లాభాలకు బ్రేక్ పడింది. ఒమిక్రాన్ కేసులు, మూడు రోజుల లాభాల స్వీకరణ సూచీలపై ప్రభావం చూపాయి. ఐటీ స్టాక్స్ మాత్రం ర్యాలీ చేశాయి. మిగతా రంగాలు అన్నీ నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.5 శాతం నుండి 1 శాతం మేర నష్టపోయాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావంపై మార్కెట్ దృష్టి సారించింది. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

నష్టాల్లో మార్కెట్
సెన్సెక్స్ ఉదయం 57,567.11 పాయింట్ల వద్ద ప్రారంభమై, 57,623.69 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 56,813.42 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,149.50 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,155.60 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,909.60 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 190.97 (0.33%) పాయింట్లు లాభపడి 57,124.31 పాయింట్ల వద్ద, నిఫ్టీ 68.85 (0.40%) పాయింట్లు ఎగిసి 17,003.75 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ రూ.74.97 వద్ద ముగిసింది.

కారణమిదే...
ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరగడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. దేశీయంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కట్టడికి పలు రాష్ట్రాల్లో నైట్ లాక్ డౌన్, జన సమూహంపై ఆంక్షలు విధించడం సూచీల సెంటిమెంటును దెబ్బతీశాయి. తర్వాత రెండు రోజులు కూడా సెలవు కావడంతో సోమవారానికి ఎలా ఉంటుందోననే ఆందోళనతో ఇన్వెస్టర్లు విక్రయాలకు మొగ్గు చూపారు. దీనికి తోడు మూడు రోజుల భారీ లాభాల నేపథ్యంలో నేడు ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేశారు. నిన్నటి వరకు మూడు రోజుల పాటు 1500 పాయింట్లు ఎగిసింది.

రూ.8 లక్షల కోట్లకు ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో HCL టెక్, టెక్ మహీంద్రా, ఎస్పీఐ లైఫ్ ఇన్సురెన్స్, విప్రో, ఏషియన్ పేయింట్స్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో గ్రాసీమ్, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐచర్ మోటార్స్, ఐవోసీ ఉన్నాయి.
రక్షణ, ఏరోస్పేస్ రంగాలకు ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ సరఫరా చేసే డేటా ప్యాటర్న్స్ షేర్లు నేడు స్టాక్ ఎక్స్చేంజీల్లో నమోదయ్యాయి. 48 శాతం ప్రీమియంతో ఆరంగేట్రంలో అదరగొట్టాయి. ఇష్యూ ధర రూ.558 కాగా 47.69 శాతం ప్రీమియంతో రూ.864 వద్ద, బీఎస్ఈలో 46.32 శాతం ప్రీమియంతో రూ.856.05 వద్ద ఎన్ఎస్ఈలో షేర్లు నమోదయ్యాయి.
ఇన్ఫోసిస్ షేర్ల దాదాపు మూడు శాతం లాభపడి రూ.1,875.75కు చేరుకుంది. వరుసగా ఈ కంపెనీ షేర్లు నాలుగు రోజులు లాభపడి ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.8 లక్షల కోట్లు దాటింది. ఈ మైలురాయిని అందుకున్న నాలుగో దేశీయ ఐటీ సంస్థ ఇది.