Market Crash: 1000 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్.. బేజారిన నిఫ్టీ.. ఎందుకంటే..
Sensex Crash: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు కుప్పకూలాయి. ఎవ్వరూ ఊహించని రీతిలో నేడు సెన్సెక్స్-నిఫ్టీ దాదాపు 1.7 శాతం క్షీణతను నమోదు చేశాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్లలో తుడిచిపెట్టుకుపోయింది.
ఇంట్రాడేలో సెన్సెక్స్ ఏకంగా 1100 పాయింట్ల గరిష్ఠ నష్టాన్ని నమోదు చేయగా.. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ 400 పాయింట్లకు పైగా నష్టపోయింది. మార్కెట్ల క్లోజింగ్ దగ్గరపడుతున్న వేళ నష్టాలు తగ్గుతున్నాయి. సాయంత్రం 3 గంటల సమయంలో సెన్సెక్స్ సూచీ 788 పాయింట్లను కోల్పోగా.. నిఫ్టీ సూచీ 305 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 190 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1960 పాయింట్ల మేర భారీ క్షీణతను నమోదు చేసింది.

వాస్తవానికి సుదీర్ఘంగా కొనసాగిన బుల్ ర్యాలీ తర్వాత మార్కెట్ల కరెక్షన్ కొనసాగుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మార్చి 15న స్మాల్- మిడ్‌క్యాప్ ఫండ్ స్కీమ్‌ల గురించి మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు తమ ఒత్తిడి పరీక్ష ఫలితాలను వెల్లడిస్తుండటంతో ఈ కరెక్షన్ సమీప కాలంలో పొడిగించవచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లోని చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ VK విజయకుమార్ వెల్లడించారు. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు తమ పెట్టుబడిని లార్జ్ క్యాప్ స్టాక్ పోర్ట్ ఫోలియోలకు మళ్లించేందుకు ప్రస్తుత దిద్దుబాటును ఉపయోగించాలని విజయకుమార్ అన్నారు.
ఇటీవలి కాలంలో ప్రీ ఐపీవో ట్రేడింగ్ లో జరుగుతున్న తారుమారు జరుగుతుందని సెబీ చైర్మన్ ఆందోళన వ్యక్తం చేసిన వేళ మార్కెట్ల ర్యాలీకి బ్రేక్ పడింది. దీని తర్వాత నేడు మార్కెట్లో లిస్టింగ్ కోసం వచ్చిన రెండు ఐపీవోలు డిస్కౌంట్ రేటుకు లిస్ట్ కావటంతో ఇన్వెస్టర్లు నిరాశకు గురయ్యారు.


Click it and Unblock the Notifications