Russia Ukraine crisis: కుప్పకూలిన మార్కెట్లు, 2000 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య నిన్నటి వరకు ఉద్రిక్తతలు కొనసాగగా, తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ పైన యుద్ధం ప్రకటించారు. దీంతో సూచీలు కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లు, ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లోనే ఉన్నాయి. ఉక్రెయిన్‌లో మిలిటరీ ఆపరేషన్ చేపట్టినట్లు పుతిన్ తాజాగా ప్రకటించారు. దీంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. యుద్ధ భయాలతో ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీలు 3 శాతానికి పైగా నష్టపోయాయి. వీఐఎక్స్ 24 శాతంగా నమోదయింది.
సెన్సెక్స్ క్రితం సెషన్‌లో 57,232 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు ఆరంభంలోనే దాదాపు 2000 పాయింట్లు కుప్పకూలి 55,418 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. గరిష్టం కనీసం 56,000 పాయింట్లను తాకలేదు. ఉదయం గం.10 వరకు గరిష్టం 55,996 పాయింట్లు, కనిష్టం 55,147 పాయింట్లు. అంటే ఓ సమయంలో 2100 పాయింట్ల వరకు నష్టపోయింది సెన్సెక్స్. నిఫ్టీ 16,548 పాయింట్ల వద్ద ప్రారంభమై, 16,705 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,453 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఈ వార్త రాసే సమయానికి సెన్సెక్స్ 1817 పాయింట్లు క్షీణించి 55,414 పాయింట్ల వద్ద, నిఫ్టీ 529 పాయింట్లు క్షీణించి 16,533 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

ఉక్రెయిన్ పైన రష్యా యుద్ధం ప్రకటన నేపథ్యంలో చమురు ధరలు కూడా భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయియ బ్రెంట్ క్రూడ్ 100 డాలర్లను సమీపించింది. దీంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications