రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు, భారీ నష్టాల నుండి స్వల్ప నష్టాల్లోకి...
భారత స్టాక్ మార్కెట్లు నేడు స్వల్పనష్టాల్లో ఉన్నాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు, మధ్యాహ్నం లాభాల్లోకి వచ్చినప్పటికీ, చివరకు సాయంత్రానికి తిరిగి నష్టాల్లోకి వెళ్లాయి. క్రితం సెషన్‌లో సెన్సెక్స్ 57,892 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు దాదాపు 400 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. ఆ తర్వాత కాసేపటికి దాదాపు 300 పాయింట్ల లాభాల్లోకి వచ్చింది. సాయంత్రానికి స్వల్ప నష్టాల్లోకి జారుకుంది.
సెన్సెక్స్ 57,488.39 పాయింట్ల వద్ద ప్రారంభమై, 58,175.35 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,488.39 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,236.05 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,380.80 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,219.20 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ ఆల్ టైమ్ గరిష్టం 62,245 పాయింట్లకు దాదాపు 4500 పాయింట్ల దూరంలో ఉంది.

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే యూఎస్ సెక్రటరీ ఆప్ స్టేట్ ఆంటోని బ్లింకెన్ వచ్చే వారం రష్యా ప్రతినిధి సెర్గీ లావ్‌రోవ్‌తో సమావేశం కానున్నారు. దీంతో ఉద్రిక్తతలు తగ్గుతాయనే ఆశలు నెలకొన్నాయి. అందుకే గత రాత్రి అమెరికా వాల్‌స్ట్రీట్‌లో అమ్మకాల జోరు తగ్గింది. ఈ ప్రభావం మన మార్కెట్ పైన కనిపించి, ఇక్కడ కూడా అమ్మకాలు కాస్త తగ్గాయి. ఇద్దరు ప్రతినిధుల భేటీ నేపథ్యంలో మార్కెట్లు అప్రమత్తంగా కదలాడుతున్నాయి.


Click it and Unblock the Notifications