6 రోజుల్లో రూ.11 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరి, 3500 పాయింట్లు డౌన్
ముంబై: గత గురువారం నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ఈ వారం కూడా అదే కొనసాగింది. వరుసగా ఆరు సెషన్లు మార్కెట్లు భారీగా పతనం అయ్యాయి. బడ్జెట్‌కు ముందు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడానికి తోడు అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల వల్ల వరుసగా నష్టపోతున్నాయి. దీంతో లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. ఈ ఆరు రోజుల్లో రూ.11 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది.
ఈ నెల 21వ తేదీ నుండి ఇప్పటి వరకు సెన్సెక్స్ 3,500 పాయింట్లకు పైగా లేదా 7 శాతం నష్టపోయింది. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.11,57,928.54 కోట్లు క్షీణించి రూ.1,86,12,644.03 కోట్లకు పడిపోయింది. బడ్జెట్‌కు ముందు వారం రోజుల్లో సెన్సెక్స్ 5 శాతం క్షీణించింది. ఓ సమయంలో 14,600 పాయింట్లు క్రాస్ చేసి, 15000 దిశగా దూసుకెళ్తున్నట్లు కనిపించిన నిఫ్టీ 13,650 పాయింట్ల దిగువన ముగిసింది.

కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వే మార్కెట్లను మెప్పించలేకపోయాయి. గ్లోబల్ మార్కెట్లు తీవ్రఒత్తిడికి గురికావడం, విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణ వంటి పరిణామాలు మార్కెట్ పైన ప్రభావం చూపింది. నిన్న ఓ దశలో వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ చివరకు 588 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 182.95 పాయింట్లు(1.32 శాతం) తగ్గి 13,634 వద్ద ముగిసింది.


Click it and Unblock the Notifications