600 పాయింట్ల మేర సెన్సెక్స్ జంప్, ఇన్వెస్టర్ల సంపద పెరుగుతోంది
బడ్జెట్ తర్వాత స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. అన్ని రంగాలు కూడా లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్, రియాల్టీ, ఫార్మా, ఐటీ, పీఎస్‌యూ బ్యాంకింగ్ స్టాక్స్ ఒక శాతం చొప్పున లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా ఒక శాతం మేర ఎగిశాయి. ఆర్థిక రికవరీకి, ఉద్యోగాల సృష్టికి మద్దతుగా బడ్జెట్‌లో మౌలిక రంగ వ్యయాలను భారీగా పెంచడం, కొత్తగా పన్నులు విధించకపోవడం వంటి అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి. ఎలక్ట్రానిక్ వాహనాలు, ట్రాన్సుపోర్ట్ ఇన్ఫ్రా, మెటల్స్, సోలార్, సిమెంట్, కన్స్ట్రక్షన్, టెల్కోస్, డిజిటల్ ఫైనాన్స్, డిఫెన్స్ రంగాలకు పెద్ద పీట వేయడంతో ఉద్యోగాలు, ఉపాది కల్పన జరుగుతుంది. ఆర్థిక రికవరీకి అండగా బడ్జెట్ ఉండటంతో సూచీలు ముందుకెళ్తున్నాయి. దీనికి అంతర్జాతీయ మార్కెట్ సానుకూల సంకేతాలు కూడా తోడయ్యాయి.
బీఎస్ఈ హెల్త్ కేర్ ఇండెక్స్ 30 స్టాక్స్‌లో ఇరవై స్టాక్స్ లాభాల్లో ఉండగా, 10 స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ నేడు 59,293.44 పాయింట్ల వద్ద ప్రారంభమై, 59,536.53 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 59,193.05 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1.45 సమయానికి సెన్సెక్స్ 589.72 (1.00%) పాయింట్లు లాభపడి 59,448.77 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 17,706.20 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,768.30 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,674.80 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1.45 సమయానికి నిఫ్టీ 172.00 (0.98%) పాయింట్లు లాభపడి 17,750.40 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫిన్ సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంకు, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్, కొటక్ మహీంద్రా ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో టెక్ మహీంద్రా, బ్రిటానియా, నెస్ట్లే, శ్రీ సిమెంట్స్, మారుతీ సుజుకీ ఉన్నాయి. జనవరి 20కి ముందు రూ.2.80 లక్షల కోట్లుగా ఉన్న బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆ తర్వాత వరుస నష్టాల కారణంగా రూ.2.60 లక్షల కోట్లకు పడిపోయింది. వరుసగా రెండు రోజుల లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద నిన్నటికే రూ.2.67 లక్షల కోట్లకు చేరింది.


Click it and Unblock the Notifications