రష్యా దూకుడు, అమెరికా కఠిన ఆంక్షలు: స్టాక్ మార్కెట్ పరుగులు
స్టాక్ మార్కెట్లు శుక్రవారం(ఫిబ్రవరి 25) లాభాల్లో ప్రారంభమయ్యాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్నప్పటికీ నిన్నటి భారీ పతనం నేపథ్యంలో కనిష్టాల వద్ద ఆరంభంలో కొనుగోళ్ల మద్దతు లభించింది. దీనికి తోడు ఉక్రెయిన్ పైన రష్యా పట్టు సాధించడం, రష్యా చర్యలకు అమెరికా, యూరోప్ దేశాలు కఠిన ఆర్థిక ఆంక్షలను ప్రకటించడం వంటి అంశాలు పుతిన్‌ను కొంతమేర నిలువరిస్తాయనే సంకేతాలు ఉన్నాయి. దీంతో గురువారం భారీగా నష్టపోయిన మార్కెట్లు, నేడు దాదాపు అదే స్థాయి లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు నిన్న భారీ నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ, చివరలో కాస్త పుంజుకొని, నష్టాలను తగ్గించాయి. దీంతో ఆసియా మార్కెట్లు నేడు సానుకూలంగా ఉన్నాయి.

జోబిడెన్ చర్యల ఎఫెక్ట్
ఉక్రెయిన్ పైన రష్యా దాడులు కొనసాగుతున్న కారణంగా గరిష్టాల వద్ద అమ్మకాల ఒత్తిడి ఉండవచ్చునని మార్కెట్ నిపుణుల అభిప్రాయం. మార్కెట్లు నేడు లాభాల్లో ఉన్నప్పటికీ, ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే, ప్రస్తుత కనిష్టాల వద్ద కొనుగోళ్లు తాత్కాలికమేనని, ఆ తర్వాత నష్టాలకు అవకాశముంటుందని అంటున్నారు. అయితే వివిధ పరిణామాలు సానుకూలంగా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ముడి చమురు ధరలు 100 డాలర్ల పైకి చేరుకున్నప్పటికీ, నేడు కాస్త శాంతించాయి. పసిడి ధరలు కూడా నేడు వెనక్కి వచ్చాయి. రష్యా పైన అమెరికా అధ్యక్షులు జోబిడెన్ ఆంక్షలు కాస్త సానుకూలతకు కారణమయ్యాయి.

కోలుకున్న మార్కెట్
సెన్సెక్స్ నేడు 55,321 పాయింట్ల వద్ద ప్రారంభమై, 55,984 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 55,299 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.10.25 సమయానికి సెన్సెక్స్ 1300 పాయింట్లు లేదా 2.39 శాతం లాభపడి 55,830 పాయింట్ల వద్ద, నిఫ్టీ 397 పాయింట్లు లేదా 2.44 శాతం లాభపడి 16,645 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.నిఫ్టీ నేడు 16,500 పాయింట్లను క్రాస్ చేసింది. సెన్సెక్స్ 56,000 పాయింట్లను సమీపించింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
అన్ని రంగాలు కూడా లాభాల్లోనే కనిపిస్తున్నాయి. పీఎస్‌యు బ్యాంకు, మెటల్, రియాల్టీ సూచీలు 4 శాతం లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 3 శాతం చొప్పున ఎగిశాయి. ఉదయం సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్, రిలయన్స్, మారుతీ సుజుకీ, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో బ్రిటానియా, నెస్ట్లే, HUL ఉన్నాయి.


Click it and Unblock the Notifications