లాభాల నుండి నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు: అందుకే నష్టాలు
నిన్న భారీ నష్టాలను మూటగట్టుకున్న స్టాక్ మార్కెట్లు నేడు (ఏప్రిల్ 19, మంగళవారం) ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. సోమవారం నాటి భారీ పతనం నేపథ్యంలో ఆరంభంలో కొనుగోళ్లకు మద్దతు లభించింది. సోమవారం తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగిన అమెరికా మార్కెట్లు చివరకు స్వల్ప నష్టాలతో ముగిశాయి.
ఆసియా మార్కెట్లు నేడు సానుకూలంగా కదలాడుతున్నాయి. ద్రవ్యోల్భణ భయాలు, అంచనాలను అందుకోలేకపోతున్న త్రైమాసిక ఫలితాలు, చమురు ధరల పెరుగుదల, కరోనా కేసులు పెరగడం వంటి అంశాలు మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీశాయి.

సెన్సెక్స్ 57,381 పాయింట్ల వద్ద ప్రారంభమై, 57,027 పాయింట్ల వద్ద కనిష్టాన్ని, 57,460 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.11 సమయానికి సెన్సెక్స్ 98 పాయింట్లు క్షీణించి 57,066 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 17,258 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,275 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,152 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. గం.11 సమయానికి నిఫ్టీ 7.35 పాయింట్లు క్షీణించి 17,165 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
నిన్న మార్కెట్లు భారీ నష్టాల్లో ముగియడంతో ఇన్వెస్టర్ల సంపద రూ.2.58 లక్షల కోట్లు హరించుకుపోయింది. ఇన్ఫోసిస్, HDFC బ్యాంకు బలహీన ఫలితాల నేపథ్యంలో అమ్మకాలు వెల్లువెత్తాయి. సెన్సెక్స్ క్రితం సెషన్‌లో 1172 పాయింట్లు నష్టపోయి 57,166 పాయింట్ల వద్ద ముగిసింది. ఓ సమయంలో 56,850 పాయింట్ల దిగువన కూడా ట్రేడ్ అయింది. కానీ చివరలో స్వల్పంగా కోలుకుంది. నిఫ్టీ 302 పాయింట్లు నష్టపోయి 17,173 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు కూడా నష్టాలు కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications