సెన్సెక్స్ 860 పాయింట్లు పతనం, మార్కెట్ భారీ నష్టానికి కారణాలివే
స్టాక్ మార్కెట్లు సోమవారం(ఫిబ్రవరి 7, 2022) భారీ నష్టాల్లో ప్రారంభం అయ్యాయి. ఉదయం స్వల్పనష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు, ఆ తర్వాత అంతకంతకూ క్షీణించి 800 పాయింట్లకు పైగా క్షీణించింది. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 74.72 పాయింట్ల వద్ద కదలాడుతోంది. గతవారం బడ్జెట్‌కు ముందు, తర్వాత మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. రూ.57,000 స్థాయి నుండి 59,000కు పరుగు పెట్టింది. అయితే మూడు సెషన్‌లుగా ప్రాఫిట్ బుకింగ్ కనిపించి సూచీలు నష్టాల్లోకి వెళ్లి, మళ్లీ 58,000 పాయింట్ల దిగువకు వచ్చింది.

అందుకే నష్టాల్లో..
బడ్జెట్‌కు కొద్ది రోజుల ముందు వరకు మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. 61,000 దాటిన సెన్సెక్స్, బడ్జెట్‌కు ముందు భారీ కరెక్షన్‌కు గురై 57,000 స్థాయికి వచ్చింది. అయితే బడ్జెట్‌కు ముందు, తర్వాత మాత్రం దాదాపు అదేస్థాయిలో లాభపడి 59,000 దాటింది. దాదాపు 2000 పాయింట్లు ఎగిసింది. అయితే గత మూడు సెషన్లుగా మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ కారణంగా నష్టపోయింది. గతవారం చివరి సెషన్‌లలో స్వల్పంగా నష్టపోయినప్పటికీ, నేడు మాత్రం భారీగా నష్టపోయింది. దీనికి తోడు అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, ముడి చమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ ఆందోళనలు ప్రభావం చూపుతున్నాయి.

చైనా మినహా...
చైనా మినహా ఆసియా సూచీలు అన్నీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా ఫ్యూచర్స్ కూడా నష్టాల్లోనే ఉన్నాయి. ఆర్బీఐ వడ్డీ రేట్ల ప్రభావం మార్కెట్ల పైన ఉంటుంది. దీంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్, టాటా స్టీల్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, కోల్ ఇండియా ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో HDFC లైఫ్, HDFC బ్యాంకు, లార్సన్, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్, బ్రిటానియా ఉన్నాయి.

సెన్సెక్స్, నిఫ్టీ భారీ పతనం
సెన్సెక్స్ నేడు 58,549.67 పాయింట్ల వద్ద ప్రారంభమై, 58,707.76 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,805.80 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,456.30 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,536.75 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,265.70 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1.15 సమయానికి సెన్సెక్స్ 862 పాయింట్లు లేదా 1.5 శాతం నష్టపోయి 57,782 పాయింట్ల వద్ద, నిఫ్టీ 245 పాయింట్లు లేదా 1.40 శాతం క్షీణించి 17,265 పాయింట్ల వద్ద ముగిసింది.


Click it and Unblock the Notifications