దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం లాభాల్లో ముగిసింది. కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కీలక వడ్డీరేట్లని స్థిరంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న అంశం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. దీంతో సూచీలు వరుసగా మూడో రోజు లాభపడ్డాయి. FY23 జీడీపీ వృద్ధి రేటును 7.8 శాతం, FY22 సీపీఐ ద్రవ్యోల్భణం 5.3 శాతంగా, FY23 ద్రవ్యోల్భణం 4.5 శాతంగా అంచనా వేస్తోంది. ఆర్బీఐ వడ్డీ రేట్లు, గణాంకాలు ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. జపాన్, ఆస్ట్రేలియా లాభపడగా, హాంగ్‌కాంగ్, సౌత్ కొరియా, షాంఘై నష్టపోయింది.

ఇన్వెస్టర్ల అప్రమత్తత
ఆర్బీఐ సమీక్ష నేపథ్యంలో ఉదయం ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. దీంతో ట్రేడింగ్ ఆరంభంలో సూచీలు కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. అయితే వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ ఆర్బీఐ కీలక ప్రకటన చేసిన తర్వాత బుల్ పుంజుకుంది. ఓదశలో సెన్సెక్స్ 59,000 పాయింట్లను దాటింది. నేడు దాదాపు అన్ని రంగాలు రాణించాయి. ఐటీ, బ్యాంకింగ్, పవర్, మెటల్ రంగ సూచీలు ఒక శాతం మేర పెరిగాయి.

సెన్సెక్స్, నిఫ్టీ
సెన్సెక్స్ నేడు 58,810.53 పాయింట్ల వద్ద ప్రారంభమై, 59,060.24 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 58,332.28 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,554.10 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,639.45 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,427.15 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 460 పాయింట్లు లేదా 0.79 శాతం ఎగిసి 58,926 పాయింట్ల వద్ద, నిఫ్టీ 142 పాయింట్లు లేదా 0.81 శాతం లాభపడి 17,605 పాయింట్ల వద్ద ముగిసింది.
బీఎస్ఈ 30 స్టాక్స్‌లో కేవలం ఐదు స్టాక్స్ మాత్రమే నష్టపోయాయి.

10 పైసలు క్షీణించిన రూపాయి
అమెరికా డాలర్ మారకంతో రూపాయి నేడు 10 పైసలు క్షీణించి 74.94 వద్ద ముగిసింది. ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించింది. ఆ తర్వాత సూచీలు పరుగు పెట్టాయి. నేడు రూపాయి 74.90 వద్ద ప్రారంభమై, 74.88 వద్ద గరిష్టాన్ని తాకింది. 75.05 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 74.94 వద్ద ముగిసింది. క్రితం సెషన్‌లో 74.84 వద్ద ముగిసింది.


Click it and Unblock the Notifications