ఫెడ్ నిర్ణయానికి ముందు, 1040 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్
భారత స్టాక్ మార్కెట్లు బుధవారం (మార్చి 16) భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేటుపై నేడు రాత్రి నిర్ణయించనుంది. ఫెడ్ వడ్డీ రేటుకు ముందు భారీగా కొనుగోళ్లకు మద్దతు కనిపించింది. ఐదు రోజుల పాటు వరుసగా లాభపడిన మార్కెట్లు మంగళవారం భారీగా నష్టపోయాయి. నిన్న ఇన్వెస్టర్లకు నష్టాలు మిగిల్చిన సూచీలు, నేడు లాభాల పంటను పండించాయి. ఉదయం ఉత్సాహంగ ప్రారంభమైన మార్కెట్లు, ఏ దశలోను తగ్గలేదు. ఉదయం నుండి కాస్త ప్లాట్‌గా, కాస్త పైకి లేస్తూ ముందుకు కదిలాయి.

అందుకే లాభాల్లో మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్లు ఈ రోజు సానుకూలంగా కదలాడాయి. టెక్ స్టాక్స్ లిస్టింగ్ విషయంలో అమెరికా, చైనా మధ్య సయోధ్య కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో చైనా, హాంగ్‌కాంగ్ సూచీలు భారీ లాభాలు నమోదు చేశాయి. జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా మార్కెట్లు పరుగు పెట్టాయి.
అమెరికా ఫెడ్ రిజర్వ్ సమావేశ నిర్ణయాలు త్వరలో వెలువడనున్నాయి. వడ్డీ రేట్ల పెంపు 50 బేసిస్ పాయింట్లకు బదులు 25 బేసిస్ పాయింట్లు పెంచుతారనే సంకేతాలు రావడం, మార్కెట్ పుంజుకోవడానికి కారణమైంది.
దేశీయ మార్కెట్ అనిశ్చితిని అంచనా వేసే వోలాటిలిటీ ఇండెక్స్ (VIX) దిగి వచ్చింది. దీంతో మార్కెట్ త్వరలో స్థిరీకరించుకునే పరిస్థితి ఉందనే అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి. ఫిబ్రవరి 24న 34గా ఉన్న VIX నేడు 25 దిగువకు వచ్చింది.
ఉక్రెయిన్-రష్యా చర్చలు ముగింపుకు వచ్చే సంకేతాలు ఉన్నాయి.
అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. టోక్యో షేర్లు ఫెడ్ నిర్ణయానికి ముందు పరుగు పెట్టాయి.

వెయ్యి పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
సెన్సెక్స్ నేడు 1.86 శాతం లేదా 1,040 పాయింట్లు లాభపడి 56,816 పాయింట్ల వద్ద, నిఫ్టీ 1.87 శాతం లేదా 312 పాయింట్లు లాభపడి 16,975 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ నేడు ఉదయం 56,555 పాయింట్ల వద్ద ప్రారంభమై, 56,860 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 56,389 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 16,876 పాయింట్ల వద్ద ప్రారంభమై, 16,987 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,837 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

పేటీఎం జంప్
పేటీఎం స్టాక్ ధర నేడు 7 శాతానికి పైగా లాభపడింది. క్రితం సెషన్‌లో రూ.592 వద్ద ముగిసిన ఈ స్టాక్ నేడు 364.80 వద్ద ముగిసింది. పేటీఎం మార్కెట్ క్యాప్ రూ.41.15 వేల కోట్లకు పెరిగింది. నేడు 3534 స్టాక్స్ ట్రేడ్ కాగా, 2306 స్టాక్స్ లాభాల్లో, 1128 స్టాక్స్ నష్టాల్లో, 100 స్టాక్స్‌లో ఎలాంటి మార్పు లేకుండా ముగిశాయి. 112 స్టాక్స్ 52 వారాల గరిష్టాన్ని, 23 స్టాక్స్ 52 వారాల కనిష్టాన్ని తాకాయి. 18 స్టాక్స్ అప్పర్ సర్క్యూట్‌ను, 7 స్టాక్స్ లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.


Click it and Unblock the Notifications