చివరి అరగంటలో అంతా రివర్స్.. రెండో రోజు నష్టాల్లో మార్కెట్లు: రిలయన్స్ మరింత డౌన్
ముంబై: స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. నిన్న పది రోజుల లాభాలకు చెక్ చెబుతూ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. నేడు లాభాల్లో ప్రారంభమై, మధ్యాహ్నం గం.3 వరకు లాభాల్లో కనిపించినప్పటికీ, చివరి అరగంటలో భారీగా నష్టపోయాయి. ఉదయం సెన్సెక్స్ 48,524 పాయింట్ల వద్ద ప్రారంభమై, ఓ సమయంలో 48,558 పాయింట్లను తాకింది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు లాభాల్లోనే ఊగిసలాట కనిపించింది. చివరి అరగంటలో మాత్రం ఓ సమయంలో 48,037 పాయింట్ల స్థాయికి పతనమైంది. ఆ తర్వాత కాస్త కోలుకున్నప్పటికీ నష్టాల్లోనే ముగిసింది.

నేటి సెషన్లో...
నేటి సెషన్లో సెన్సెక్స్ 48,558-48,038 పాయింట్ల మధ్య కదలాడింది. నేటి కనిష్టం, గరిష్టం మధ్య 520 పాయింట్లు తేడా ఉంది. సెన్సెక్స్ 81 పాయింట్లు (0.17 శాతం) క్షీణించి 48,093.32 పాయింట్ల వద్ద, నిఫ్టీ 9 పాయింట్లు(0.1 శాతం) పడిపోయి 14,137.35 పాయింట్ల వద్ద ముగిసింది.
డాలర్ మారకంతో నేడు రూపాయి 3 పైసలు ఎగబాకి 73.08 వద్ద ముగిసింది. నిన్న రూపాయి 73.11 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ మెటల్ దాదాపు 4 శాతం లాభపడింది.

మోస్ట్ యాక్టివ్
నేటి మోస్ట్ గెయినర్స్ జాబితాలో టాటా స్టీల్ 5.70 శాతం, హిండాల్కో 5.35 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 3.80 శాతం, అదానీ పోర్ట్స్ 3.43 శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంకు 3.22 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో నెస్ట్లే 2.10 శాతం, HDFC లైఫ్ 2.05 శాతం, హిందూస్తాన్ యూనీలీవర్ 2.00 శాతం, దివిస్ ల్యాబ్స్ 1.98 శాతం, టైటాన్ కంపెనీ 1.92 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, టాటా స్టీల్, భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.06 శాతం నష్టపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 2.08 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.53 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.50 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.20 శాతం, నిఫ్టీ మీడియా 0.60 శాతం, నిఫ్టీ మెటల్ 3.82 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.70 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.35 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.74 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ ఎనర్జీ 0.32 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.89 శాతం, నిఫ్టీ ఐటీ 0.66 శాతం, నిఫ్టీ ఫార్మా 0.44 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications