రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వడ్డీ రేటు పెంపు ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. ఆర్బీఐ ఈసారి కూడా వడ్డీ రేట్లు పెంచుతుందనే అంచనాలతో ఉదయం మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కాస్త లాభాల్లోకి వచ్చినప్పటికీ, రెపో రేటు పెంపు ప్రకటన అనంతరం తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే ఈ పెంపు ఊహించిన స్థాయిలో ఉండటంతో ఇన్వెస్టర్లు కనిష్టాల వద్ద కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో సూచీలు మళ్లీ లాభాల్లోకి వచ్చాయి. అయితే ద్రవ్యోల్భణం పెరిగే అవకాశముందని ఆర్బీఐ ప్రకటించడంతో తిరిగి అమ్మకాలు వెల్లువెత్తాయి. వృద్ధి రేటు అంచనాలను తగ్గించడం కూడా ప్రతికూలంగా మారింది.
సెన్సెక్స్ ఉదయం 55,345 పాయింట్ల వద్ద ప్రారంభమై, 55,423 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 54,683 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 215 పాయింట్లు క్షీణించి 54,892 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 16,475 పాయింట్ల వద్ద ప్రారంభమై, 16,514 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,293 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ చివరకు 60 పాయింట్లు క్షీణించి 16,356 పాయింట్ల వద్ద ముగిసింది. ఆర్బీఐ రెపో రేటు పెంపు ఉంటుందనే అంచనాలతో గత నాలుగు సెషన్‌లుగా మార్కెట్లు అప్రమత్తంగా ఉండటంతో నష్టాల్లో ముగిశాయి. వరుసగా నాలుగో రోజు సూచీలు నష్టపోయాయి.

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టాటా స్టీల్, ఎస్బీఐ, టైటాన్ కంపెనీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, రిలయన్స్, యూపీఎల్, ఏషియన్ పేయింట్స్ ఉన్నాయి. ఇక డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 77.75 వద్ద ఉంది. క్రితం సెషన్‌తో 5 పైసలు క్షీణించింది.


Click it and Unblock the Notifications