మొన్నటి నష్టాలు.. ఈ రెండ్రోజుల్లో రికవరీ: లాభాలకు కారణాలివే
స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిసింది. ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో సోమవారం సూచీలు దాదాపు 2 శాతం నష్టపోయిన విషయం తెలిసిందే. సెన్సెక్స్ ఏకంగా 1200 పాయింట్లు పతనమైంది. అయితే నిన్న మార్కెట్ కాస్త కోలుకుంది. నేడు మరింత లాభపడి, మొన్నటి నష్టాలను రికవరీ చేశాయి. దేశీయంగా ఒమిక్రాన్ కట్టడికి కేంద్రం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇవ్వడం ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపింది. అమెరికాలో లాక్ డౌన్ ఉండబోదని అగ్రరాజ్యం అధ్యక్షుడు జోబిడెన్ హామీ ఇవ్వడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. అలాగే, ఇటీవలి సూచీల భారీ పతనం నేపథ్యంలో కనిష్ఠాల వద్ద ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. వీటన్నింటికి తోడు హెవీ వెయిట్స్ రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, ఐసీఐసీఐ వంటి స్టాక్స్ రాణించడం కలిసి వచ్చింది.

మొన్నటి నష్టాలు నేడు రికవరీ
సెన్సెక్స్ ఉదయం 56,599.47 పాయింట్ల వద్ద ప్రారంభమై, 56,989.01 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 56,471.03 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 16,865.55 పాయింట్ల వద్ద ప్రారంభమై, 16,971.00 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,819.50 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 611.55 (1.09%) పాయింట్లు లాభపడి 56,930.56 వద్ద, నిఫ్టీ 184.60 (1.10%) పాయింట్లు ఎగిసి 16,955.45 పాయింట్ల వద్ద ముగిసింది. నిన్న సెన్సెక్స్ 497 పాయింట్లు ఎగిసింది. మొన్న సెన్సెక్స్ 1189 పాయింట్లు నష్టపోగా, తర్వాత రెండు రోజుల్లో 1100 పాయింట్లకు పైగా లాభపడింది. అంటే మొన్నటి నష్టాలను నేడు రికవరీ చేసింది.

మెట్రో బ్రాండ్స్ ఇలా..
ప్రముఖ ఫుట్ వేర్ రిటైలర్ మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్ లిస్టింగ్‌లో నిరాశపరిచింది. 12.6 శాతం రాయితీతో ఆరంభంలోనే ఇన్వెస్టర్లను నిరాశపరిచింది. ఇష్యూ ధర రూ.500 కాగా, 12.8 శాతం రాయితీతో రూ.436 వద్ద నమోదయింది. ఎన్ఎస్ఈలో 12.6 శాతం రాయితీతో రూ.737 వద్ద ఎన్ఎస్ఈలో షేర్లు నమోదయ్యాయి. అయితే ట్రేడింగ్‌లో దూసుకెళ్లింది. భారీ లాభాల్లోకి వెళ్లినప్పటికీ, చివరకు 4.5 శాతం నష్టంతో రూ.495 వద్ద ముగిసింది.
కొత్త షేర్ల జారీ, రుణం ఇతర ఆమోదయోగ్య మార్గాల ద్వారా రూ.10వేల కోట్ల సమీకఱణకు బోర్డు అనుమతి లభించడంతో యెస్ బ్యాంకు షేర్లు ట్రేడింగ్‌లో 5 శాతం ఎగిశాయి.

ఈ స్టాక్స్ జంప్
బీఎస్ఈ 30 స్టాక్స్‌లో నేడు ఐటీసీ, నెస్ట్లే, విప్రో స్వల్పంగా నష్టపోయాయి. మిగతా 27 స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, ఎల్ అండ్ టీ, సన్ ఫార్మా, రిలయన్స్, ఎస్బీఐ, టాటా స్టీల్ రెండు శాతానికి పైగా లాభపడ్డాయి.
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో హిండాల్కో, టాటా మోటార్స్, దివిస్ ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్, ఐచర్ మోటార్స్ ఉన్నాయి.
నేటి టాప్ లూజర్స్ జాబితాలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్, విప్రో, ఐవోసీ, అదానీ పోర్ట్స్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications