460 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, నిఫ్టీ 17,350 పాయింట్ల పైన
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. మార్కెట్లలో కొత్త జోష్ కనిపించింది. సెన్సెక్స్ 2022 డిసెంబర్ నాటికి 70,000 పాయింట్లకు లేదా 80,000 పాయింట్లకు చేరుకుంటుందనే అంచనాల నేపథ్యంలో సూచీలు పరుగు పెట్టాయి. త్రైమాసిక ఫలితాలు, బడ్జెట్ అంచనాలు, కొత్త ఏడాదిలో FIIల రీఎంట్రీ వంటి పరిణామాలతో జనవరి నెల సూచీలకు కలిసి వచ్చే అవకాశం ఉందనే అంచనాలు శుక్రవారం నాటి మార్కెట్లపై ప్రభావం చూపింది. మరోవైపు వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పెంపు అమలును వాయిదా వేయడం కూడా సెంటిమెంటును పెంచింది. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ సూచీలు బలపడ్డాయి.
నిఫ్టీ 17,300 పాయింట్ల పైన ముగిసింది. నిఫ్టీ 2021 ఏడాదిలో 24 శాతం లాభపడింది. సెన్సెక్స్ 57,849 పాయింట్ల వద్ద ప్రారంభమై, 58,409.30 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,846.52 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,244.50 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,400.80 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,238.50 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 459.50 (0.80%) పాయింట్లు ఎగిసి 58,253.82 పాయింట్ల వద్ద, నిఫ్టీ 150.10 (0.87%) పాయింట్లు లాభపడి 17,354.05 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్ఈ 30 ఇండెక్స్‌లో డాక్టర్ రెడ్డీస్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ మాత్రమే నష్టపోయాయి. మిగతా స్టాక్స్ లాభాల్లో ముగిశాయి.

2021 క్యాలెండర్ ఏడాదిలో సెన్సెక్స్ 22 శాతం రిటర్న్స్, నిఫ్టీ 24.1 శాతం రిటర్న్స్ ఇచ్చింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఈ ఏడాది 46.1 శాతం, స్మాల్ క్యాప్ 100 ఏకంగా 59.3 శాతం రిటర్న్స్ ఇచ్చింది. భారీగా లాభపడిన స్టాక్స్‌లో టైటాన్, అల్ట్రా టెక్ సిమెంట్, కొటక్ మహీంద్రా బ్యాంకు, మారుతీ, ఎస్బీఐ ఉన్నాయి. నష్టపోయిన స్టాక్స్‌లో ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications