కరోనా వ్యాక్సీన్ దెబ్బ, అస్ట్రాజెనికా షేర్లు డౌన్: కుప్పకూలిన మార్కెట్లు
ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం (సెప్టెంబర్ 9) నష్టాల్లో ముగిశాయి. ఉదయం సెన్సెక్స్ 148 పాయింట్ల నష్టం, నిఫ్టీ 45పాయింట్ల నష్టంతో ప్రారంభం కాగా, అంతకుమించిన నష్టంతో క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 171 పాయింట్లు(0.45 శాతం) క్షీణించి 38,193.92 పాయింట్ల వద్ద, నిఫ్టీ 39 పాయింట్లు (0.35 శాతం) నష్టపోయి 11,278 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఓ దశలో 400 పాయింట్ల మేర కూడా నష్టపోయింది. ఆ తర్వాత అంతరం తగ్గి 171 పాయింట్ల నష్టంతో ముగిసింది.

మార్కెట్లపై అస్ట్రాజెనికా దెబ్బ.. షేర్లు భారీగా డౌన్
ఆక్స్‌ఫర్డ్ టీకా అస్ట్రాజెనికా టీకా ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేయడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు పతనమయ్యాయి. దీంతో మన మార్కెట్లు కూడా దెబ్బతిన్నాయి. అస్ట్రాజెనికా టీకా ప్రయోగాలు తాత్కాలికంగా నిలిపివేయడంతో ఆ షేర్లు భారీగా పతనమయ్యాయి. దీనికి తోడు చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఈ ప్రభావం కూడా మన మార్కెట్లపై పడింది. ఈ రోజు 45 కంపెనీలు త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి.

రిలయన్స్ దూకుడు..
అస్ట్రాజెనికా టీకా, సరిహద్దుల్లో ఉద్రిక్తత వంటి వివిధ కారణాలతో అంతర్జాతీయ మార్కెట్లు, దేశీయ మార్కెట్లు నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంక్ 2శాతం కుప్పకూలింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 90 పాయింట్లు, నిఫ్టీ బ్యాంకు 477 పాయింట్లు క్షీణించింది. రిలయన్స్‌లో సిల్వర్ లేక్ రూ.7500 కోట్ల పెట్టుబడి నేపథ్యంలో షేర్లు 2 శాతం ఎగిశాయి. ఆటో స్టాక్స్ లాభాల్లోనే ముగిశాయి. జీఎంటర్టైన్మెంట్ 3 శాతం లాభపడింది. టాటా మోటార్స్ 3 శాతం మేర నష్టపోయింది. IRCTC షేర్లు కూడా నష్టాల్లోనే క్లోజ్ అయ్యాయి. టాప్ గెయినర్స్ జాబితాలో జీఎంటర్టైన్మెంట్, టాటా స్టీల్, సిప్లా, రిలయన్స్, జేఎస్‌డబ్ల్యు స్టీల్స్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో ఎస్బీఐ, గెయిల్, బజాజ్ ఫిన్ సర్వ్, యాక్సిస్ బ్యాంకు, ఐవోసీ ఉన్నాయి.

బ్యాంకుల దెబ్బ
ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్ 2 శాతం ఢీలాపడింది. రియాల్టీ, ఐటీ, ఎఫ్ఎంసీజీ 1.5 శాతం నుండి 0.6 శాతం మధ్య నీరసించాయి. ఫార్మా రెండు శాతం పుంజుకుంది. మీడియా, మెటల్ ఒక శాతం బలపడ్డాయి. ఇదిలా ఉండగా, నగదు విభాగంలో మంగళవారం FIIలు దాదాపు రూ.1057 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా, DIIలు రూ.620 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. సోమవారం FPIలు రూ.7 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా, DIIలు రూ.816 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి.


Click it and Unblock the Notifications