600 పాయింట్లు పతనమైన సెన్సెక్స్, మార్కెట్ నష్టానికి కారణాలివే
ఈ వారం మంచి లాభాలతో ప్రారంభమై, నిన్న మరింత దూకుడు పెంచిన స్టాక్ మార్కెట్లు, నేడు మాత్రం నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. ఆసియా సూచీలు మాత్రం నేడు మిశ్రమంగా కదలాడుతున్నాయి. డాలర్ మారకంతో జపాన్ కరెన్సీ యెన్ రెండున్నర దశాబ్దాల కనిష్టానికి చేరుకున్నది. జపాన్ మాత్రం అన్ని కేంద్ర బ్యాంకుల్లా వడ్డీ రేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మిగతా కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపు, రష్యా గ్యాస్‌ను ఐరోపా దేశాలు నిలువరించనున్నాయనే వార్తలు మార్కెట్లను ఆందోళనకు గురి చేశాయి. దీనికి తోడు ఎఫ్ఐఐ అమ్మకాలు, మొన్న, నిన్న వరుస రెండు రోజుల భారీ లాభాల నేపథ్యంలో ఇటీవలి గరిష్టాల వద్ద అమ్మకాలు వెల్లువెత్తాయి.
సెన్సెక్స్ ఉదయం 52,186 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,272 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 51,912 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,545 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,565 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,438 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.10.25 సమయానికి సెన్సెక్స్ 512 పాయింట్లు నష్టపోయి 52,019 పాయింట్ల వద్ద, నిఫ్టీ 171 పాయింట్లు క్షీణించి 15,467 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

అన్ని రంగాలు కూడా నష్టాల్లోనే ఉన్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్, పవర్, రియాల్టీ, ఐటీ, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్ ఒక శాతం నుండి మూడు శాతం మేర క్షీణించాయి. సెన్సెక్స్ ఓ సమయంలో 600 పాయింట్ల వరకు క్షీణించింది. నిఫ్టీ 1 శాతానికి పైగా పడిపోయింది.


Click it and Unblock the Notifications