కరోనా సహా ఎన్నో భయాలు, 38వేల దిగువకు సెన్సెక్స్, ఐటీ స్టాక్స్ జూమ్
ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం(సెప్టెంబర్ 22) భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఓ సమయంలో 500 పాయింట్ల నష్టాల్లోకి వెళ్లిన సెన్సెక్స్ ఆ తర్వాత నష్టాన్ని తగ్గించుకుంది. సెన్సెక్స్ 300 పాయింట్లు (0.79 శాతం) క్షీణించి 37,734.08 పాయింట్ల వద్ద, నిఫ్టీ 97 పాయింట్లు (0.86 శాతం) నష్టపోయి 11,153.65 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
సెన్సెక్స్ 38వేల దిగువకు వచ్చింది. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.70 శాతం, 1.61 శాతం మేర నష్టపోయాయి. బీఎస్ఈ ఐటీ టెక్, ఫార్మా రంగాలు మినహా మిగతా అన్ని రంగాలు నష్టాల్లో ముగిశాయి. రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, కాపిటల్ గూడ్స్ అండ్ ఇండస్ట్రియల్ రంగాలు దాదాపు రెండు శాతం మేర నష్టపోయాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 73.58 వద్ద క్లోజ్ అయింది.

నిలబెట్టిన ఐటీ స్టాక్స్
ఐటీ రంగం భారీ లాభాల్లో క్లోజ్ అయింది. హెచ్‌సీఎల్ టెక్ 2.89 శాతం లాభపడి రూ.826, టీసీఎస్ 2.50 శాతం లాభపడి రూ.2,527 వద్ద, విప్రో షేర్ ధర 0.35 శాతం లాభపడి రూ.313 వద్ద, టెక్ మహీంద్రా 2.36 శాతం ఎగబాకి రూ.806 క్లోజ్ అయింది. ఇన్ఫోసిస్ మాత్రమే అతి స్వల్పంగా 0.19 శాతం నష్టపోయింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర 1.59శాతం నష్టపోయి రూ.2,220 వద్ద ముగిసింది.
టాప్ గెయినర్స్ జాబితాలో టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, గ్రాసీమ్, టెక్ మహీంద్రా, సిప్లా ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో జీఎంటర్టైన్మెంట్, గెయిల్, అదాని పోర్ట్స్, భారతీ ఇన్ఫ్రాటెల్, టాటా మోటార్స్ ఉన్నాయి.

7వారాల కనిష్టానికి మార్కెట్లు
- మార్కెట్లు వరుసగా 4వ రోజు నష్టాల్లో ముగిశాయి.
- సెన్సెక్స్, నిఫ్టీ 7 వారాల కనిష్టానికి చేరుకుంది.
- ఈ రోజు స్టాక్ మార్కెట్లు ప్రారంభంలో భారీగా నష్టపోయి, ఆ తర్వాత కాస్త కోలుకున్నట్లు కనిపించినప్పటికీ నష్టాలు మాత్రం మిగిలాయి.
- నిఫ్టీ బ్యాంకు 228 పాయింట్లు నష్టపోయింది.
- మిడ్ క్యాప్ ఇండెక్స్ 257 పాయింట్లు కోల్పోయింది.
- రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంకు మార్కెట్‌ను కిందకు లాగాయి. ఐటీ మేజర్ టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ భారీ లాభాల్లో ముగిశాయి.
- ఐటీ, ఫార్మా రంగాలు మినహా అన్ని రంగాలు నష్టాల్లో ముగిశాయి.
- మిడ్ క్యాప్ టాప్ లూజర్స్‌లో కెనరా బ్యాంకు, మహీంద్రా అండ్ మహీంద్రా, మనప్పురం పైనాన్స్, జీఎంఆర్ ఇన్ఫ్రా ఉన్నాయి.

నష్టాలకు కారణాలివే..
అంతర్జాతీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉండటంతో ఆ ప్రభావం ఆసియా మార్కెట్లు, భారత మార్కెట్లపై పడింది. ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 300 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 11,200 పాయింట్లు కోల్పోయింది. అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ఉండటం, కొన్ని అంతర్జాతీయ దిగ్గజ బ్యాంకులు అక్రమంగా ఆర్థిక ఒప్పందాలకు పాల్పడ్డాయనే వార్తలు రావడం, యూరోపియన్ దేశాల్లో మరోసారి లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారం మార్కెట్ సెంటిమెంటును రెండు రోజులుగా దెబ్బతీస్తున్నాయి.


Click it and Unblock the Notifications