60,000 పాయింట్లకు పైనే ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ 17850 పాయింట్లకు ఎగువనే
ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. నిన్న సూచీలు భారీగా లాభపడటంతో నేడు ప్రాఫిట్ బుకింగ్ ఉంటుందనే అనుమానాలు కనిపించాయి. కానీ ప్రారంభం నుండి అలాంటిదేమీ కనిపించలేదు. ఉదయం నుండి సూచీలు ఎప్పటికప్పుడు పైపైకి దూసుకెళ్లాయి. మధ్యాహ్నం నుండి కాస్త తగ్గినప్పటికీ మొత్తానికి లాభాల్లోనే ఉన్నాయి. ఉదయం ఓ సమయంలో 400 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్ సాయంత్రానికి 160 పాయింట్ల లాభాల్లో ముగిసింది. ఆరంభంలోనే 60,000 పాయింట్ల ఎగువన ప్రారంభమై చరిత్ర సృష్టించిన సెన్సెక్స్ చివరలో లాభాలు తగ్గినప్పటికీ... శుక్రవారం రోజంతా జోరు కొనసాగించింది. స్వల్పకాలం మినహా దాదాపు రోజంతా 60 వేల పైనే ట్రేడ్ అయింది. నిఫ్టీ సైతం రికార్డు స్థాయి గరిష్ఠాన్ని తాకింది.

సూచీలు జంప్
సెన్సెక్స్ ఉదయం 60,158.76 పాయింట్ల వద్ద ప్రారంభమై, 60,333.00 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 59,946.55 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,897.45 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,947.65 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,819.40 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 163.11 (0.27%) పాయింట్లు ఎగిసి 60,048.47 పాయింట్ల వద్ద, నిఫ్టీ 30.25 (0.17%) పాయింట్లు లాభపడి 17,853.20 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 73.75 వద్ద ముగిసింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నిఫ్టీ 50 సూచీలో ఏషియన్ పెయింట్స్, ఐచర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, HCL టెక్, భారతీ ఎయిర్‌టెల్, HDFC బ్యాంక్, మారుతీ, గ్రాసిమ్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, HDFC, విప్రో షేర్లు రాణించాయి. టాటా స్టీల్, JSW స్టీల్, ఎస్బీఐ, దివీస్ ల్యాబ్, శ్రీ సిమెంట్స్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, టాటా కన్జూమర్స్ షేర్లు నష్టపోయాయి.

ఎల్లుండి ప్రభావం
ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. సంక్షోభంలో ఉన్న చైనా రియాల్టీ దిగ్గజం ఎవర్ గ్రాండ్ బాండ్స్ వడ్డీ చెల్లింపులపై మళ్లీ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో సూచీలు కాస్త అప్రమత్తంగా కదిలాయి. ఐరోపా మార్కెట్లు ప్రతికూలంగా ఉన్నాయి. అమెరికా ఫ్యూచర్స్ కూడా నష్టాల్లో ఉంది. అంతర్జాతీయ మార్కెట్లు నేడు మిశ్రమంగా లేదా నష్టాల్లో ఉండటంతో ఎల్లుండి సూచీలపై ప్రభావం చూపే అవకాశముంది.


Click it and Unblock the Notifications