43,270 దాటిన సెన్సెక్స్: మార్కెట్ దూకుడుకు కారణాలివే..
ముంబై: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోబిడెన్ గెలుపు, కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, రికవరీ కేసులు పెరగడం, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం వంటి వివిధ కారణాలతో భారత మార్కెట్లు రెండు రోజులుగా కొత్త శిఖరాలను తాకాయి. నిన్న 700 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ నేడు సెన్సెక్స్ 680.22 పాయింట్లు(1.60%) లాభపడి 43,277.65 పాయింట్ల వద్ద ముగిసింది. ఈరోజు నిఫ్టీ 170.10 పాయింట్లు(1.37%) ఎగిసి 12,631.10 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ రెండు సూచీలు జీవనకాల గరిష్టాన్ని తాకాయి. మార్కెట్ లాభాలకు పలు కారణాలు ఉన్నాయి.

వ్యాక్సీన్ ప్రకటన
ఫైజర్ సంస్థ తమ టీకా 90 శాతం కరోనా ఇన్ఫెక్షన్‌ను అడ్డుకుందని ప్రకటించింది. దీంతో భారత్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లు మంచి లాభాలను నమోదు చేశాయి. మరిన్ని వ్యాక్సీన్ పరీక్షలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. ఫైజర్ ప్రకటన నేపథ్యంలో ఈ కంపెనీ స్టాక్స్ 20 శాతం మేర లాభపడ్డాయి. ఫైజర్ ప్రకటన నేపథ్యంలో నిన్న పసిడి, వెండి ధరలు భారీగా పడిపోయాయి. అదే సమయంలో ఈక్విటీ మార్కెట్లు బలంగా పుంజుకున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లు జంప్
జోబిడెన్ గెలుపు, కరోనా కేసులు తగ్గడం వంటి కారణాలతో అంతర్జాతీయ మార్కెట్లు మంచి లాభాలు నమోదు చేశాయి. ఈ ప్రభావం కూడా మన మార్కెట్లపై పడింది. ఆసియా మార్కెట్లలో హాంగ్‌కాంగ్ హాంగ్‌షెంగ్ 1 శాతం, ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ 0.66 శాతం, జపాన్ నిక్కీ, దక్షిణ కొరియా కోస్పి సూచీలు 0.2 శాతం చొప్పున లాభపడ్డాయి. అమెరికా డౌజోన్స్ 3 శాతం లాభపడింది. యూరోపియన్ మార్కెట్లలో ఫ్రాన్స్, బ్రిటన్ సూచీలు ఒక శాతానికి పైగా, జర్మన్ 0.2 శాతం లాభపడ్డాయి.

FII ఫ్లో
ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటుండటంతో ఫారెన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్ట్‌మెంట్స్ (FII) పెరిగాయి. భారతీయ మార్కెట్లలో అన్ని రంగాల్లో నవంబర్ నెలలో FIIలు క్రమంగా పెరుగుతున్నాయి. గత ఆరు సెషన్‌లలో రూ.17,947.80 కోట్లు కొనుగోలు చేయగా, అక్టోబర్ నెలలో ఇదే సమయంలో రూ.14,537.40 కోట్లుగా ఉంది.
మార్కెట్ ర్యాలీకి దోహదపడిన వాటిలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాలు ఉన్నాయి. లోన్ మారటోరియం పొడిగింపు లేకపోవడం, చక్రవడ్డీ భారం కేంద్ర ప్రభుత్వం భరించడం వంటి కారణాలతో స్టాక్స్ పుంజుకున్నాయి


Click it and Unblock the Notifications