గత కొద్ది రోజులుగా లాభాల్లో కనిపించిన స్టాక్ మార్కెట్లు రెండు మూడు రోజులుగా తిరిగి నష్టాల్లోకి జారుకుంటున్నాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 791.10 పాయింట్లు లేదా 2.36% నష్టపోయి 32,747.27 వద్ద, నిఫ్టీ 236.20 పాయింట్లు లేదా 2.39% నష్టపోయి 9,665.80 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. మార్కెట్ ప్రారంభంలో 168 షేర్లు లాభాల్లో, 955 షేర్లు నష్టాల్లో ఉండగా, 51 షేర్లలో మార్పు లేదు. ఓ సమయంలో 900 పాయింట్ల వరకు నష్టపోయి, ఆ తర్వాత కాస్త నష్టాన్ని మాత్రం తగ్గించుకోగలిగింది. ఉదయం గం.1.049 సమయానికి సెన్సెక్స్ 600 పాయింట్ల నష్టానికి చేరుకుంది.

బ్యాంకింగ్ స్టాక్స్‌పై ఒత్తిడి
దాదాపు అన్ని రంగాల షేర్లు కూడా నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. బ్యాంకింగ్ సెక్టార్ స్టాక్స్ ఒత్తిడిలోకి వెళ్లాయి. డాలర్ మారకంతో రూపాయి 32 పైసలు పడిపోయి 76.10 వద్ద ప్రారంభమైంది. గురువారం 75.78 వద్ద ముగిసింది. టాప్ గెయినర్స్ జాబితాలో భారతీ ఇన్ఫ్రాటెల్, బ్రిటానియా, వేదాంత, బీపీసీఎల్, భారతీ ఎయిర్‌టెల్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఇండస్ ఇండ్ బ్యాంకు, టాటా మోటార్స్, ఓఎన్జీసీ, జీ ఎంటర్టైన్మెంట్, టెక్ మహీంద్రా ఉన్నాయి.

కరోనా దెబ్బ, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం
కరోనా మహమ్మారి రెండోసారి విజృంభిస్తుందనే ఆందోళనల నేపథ్యంలో అమెరికా సహా ప్రపంచ మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లిపోయాయి. అమెరికాలో డౌజోన్స్ 7 శాతం దిగజారగా, ఎస్ అండ్ పీ 500 దాదాపు 6 శాతం పడిపోయింది. మార్చి 2020లో భారీగా నష్టపోయిన అంతర్జాతీయ మార్కెట్లో మరోసారి ఇప్పుడు కుప్పకూలాయి. కరోనా రెండోసారి విజృంభిస్తే ఆర్థికంగా పెను ప్రమాదం అని ఆర్థిక సంస్థలు, ఆర్థిక నిపుణులు కూడా హెచ్చరించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు చాలా సమయం పడుతుందని ఫెడ్జర్వ్ ప్రకటించడం కూడా కలవర పెట్టింది.

అమ్మకాలకు దిగిన ఇన్వెస్టర్లు
కరోనా రెండోసారి విజృంభించవచ్చుననే ఆందోళనల వల్ల అంతర్జాతీయ మార్కెట్లు పడిపోవడంతో పాటు చమురు ధరలు కూడా పడిపోయాయి. మూడు ప్రధాన అమెరికా స్టాక్స్ 5 శాతానికి పైగా క్షీణించాయి. మార్చి తర్వాత నుండి భారీగా పడిపోయాయి. దీంతో భారత మార్కెట్లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగుతున్నారు. దీంతో మార్కెట్లు నష్టపోతున్నాయి.

రూ.3.51 లక్షల కోట్ల నష్టం
మార్కెట్ భారీ నష్టాల్లోకి వెళ్లడంతో బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ నిన్న రూ.133.14 లక్షల కోట్ల నుండి ఈ రోజు రూ.129.63 లక్షల కోట్లకు తగ్గింది. అంటే ఉదయం కొద్ది గంటల్లోనే ఇన్వెస్టర్లు రూ.3.51 లక్షల కోట్లు నష్టపోయారు. సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా, నిఫ్టీ 224 పాయింట్లకు పైగా పడిపోయినప్పుడు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ స్థాయిలో తగ్గింది.


Click it and Unblock the Notifications