రిలయన్స్ అండతో... 58,000 పాయింట్ల పైన ముగిసిన సెన్సెక్స్
ముంబై: స్టాక్ మార్కెట్ పరుగులు పెడుతోంది. మెటల్, ఇంధనం ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లకు కొనుగోళ్లు భారీగా ఉండటంతో సూచీలు నేడు కూడా సరికొత్త గరిష్టాల్లో ముగిశాయి. సేవారంగం కార్యకలాపాలు పుంజుకోవడం, రిలయన్స్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ వంటి దిగ్గజ షేర్లు రాణించడం బాగా కలిసి వచ్చింది. డాలర్ మారకంతో పోలిస్తే రూపాయి 5 పైసలు క్షీణించి 73.01 వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ 57,983.45 పాయింట్ల వద్ద ప్రారంభమై, 58,194.79 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,764.07 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,262.45 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,340.10 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,212.20 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.
సెన్సెక్స్ చివరకు 277.41 (0.48%) పాయింట్లు లాభపడి 58,129.95 పాయింట్ల వద్ద, నిఫ్టీ 89.45 (0.52%) పాయింట్లు ఎగిసి 17,323.60 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. ఇటీవల వరుసగా లాభాల్లో ఉన్న సూచీలు రెండు రోజుల క్రితం మాత్రం ప్రాఫిట్ బుకింగ్ కారణంగా నష్టపోయింది. మార్కెట్లు నేడు ఉదయం గం.11.30 సమయానికి నష్టాల్లోకి వెళ్లినప్పటికీ, అంతలోనే పుంజుకున్నాయి. దీంతో ఉదయం ప్రారంభానికి మించిన లాభాలతో ముగిశాయి.

అందుకే జంప్
టెలికాం, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఓ దశలో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. కానీ, రిలయన్స్, ఆటో, మెటల్ షేర్ల మద్దతుతో తిరిగి పుంజుకున్నాయి. దీంతో ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండు కూడా వరుసగా 0.48 శాతం, 0.52 శాతం లాభాలతో ముగిశాయి.
రిలయన్స్‌కు తోడు బ్యాటరీ మేకర్స్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ తన బ్యాటరీ మేకర్స్ ఇన్సురెన్స్ యూనిట్‌ను HDFC లైఫ్ ఇన్సురెన్స్‌కు అప్పగించిన నేపథ్యంలో ఈ స్టాక్స్ కూడా అదరగొట్టాయి. అదే సమయంలో అమెరికా జాబ్ నివేదిక పైన అందరి దృష్టి ఉంది. సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో రిలయన్స్ 4 శాతానికి పైగా, టైటాన్ 2.60 శాతం లాభపడ్డాయి. నిన్న భారీగా లాభపడిన భారతీ ఎయిర్టెల్ నేడు 1.20 శాతం మేర క్షీణించింది. హిందూస్తాన్ యూనీలీవర్ కూడా దాదాపు ఒక శాతం మేర నష్టపోయింది. 30 స్టాక్స్ సెన్సెక్స్‌లో 11 స్టాక్స్ నష్టపోయాయి.

టాప్ లూజర్స్, గెయినర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో రిలయన్స్ 4.10 శాతం, ఓఎన్జీసీ 3.75 శాతం, కోల్ ఇండియా 3.35 శాతం, ఐవోసీ 2.68 శాతం, టైటాన్ కంపెనీ 2.65 శాతం మేర లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో HDFC లైఫ్ 3.24 శాతం, సిప్లా 1.48 శాతం, HUL 1.23 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 1.21 శాతం, HDFC బ్యాంకు 0.81 శాతం లాభపడ్డాయి.
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, టాటా స్టీల్, HDFC లైఫ్, ఇన్ఫోసిస్, కొటక్ మహీంద్రా ఉన్నాయి.

చమురు ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో క్రితం సెషన్‌లో భారీగా ఎగిసిపడిన చమురు ధరలు నేడు మిశ్రమంగా కదలాడాయి. డాలర్ బలహీనపడటం చమురు ధరలపై ప్రభావం చూపింది. యూఎస్ క్రూడ్ స్టాక్ నేడు క్షీణించింది. అమెరికా జాబ్ రిపోర్ట్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు ఆచితూచి కదులుతున్నాయి.


Click it and Unblock the Notifications