అమెరికా ఎన్నికలు... జోబిడెన్ ఎఫెక్ట్! 4 రోజులు.. రూ.4 లక్షల కోట్ల లాభం!!
ముంబై: స్టాక్ మార్కెట్లు(నవంబర్ 5) భారీలాభాల్లో ముగిశాయి. వరుసగా నాలుగు సెషన్‌లలో సెన్సెక్స్ ఏకంగా 1700 పాయింట్లు లాభపడింది. దిగ్గజ కంపెనీలు సెప్టెంబర్ త్రైమాసికంలో భారీలాభాలు నమోదు చేయడం, అమెరికా ఎన్నికలు, కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం వంటి వివిధ కారణాల వల్ల ఈ వారం మార్కెట్లు ఎగిశాయి. సోమవారం నుండి గురువారం వరకు సెన్సెక్స్ 1726 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 478 పాయింట్లు పెరిగింది. అక్టోబర్ 30న సెన్సెక్స్ 39,614గా ఉండగా, నిఫ్టీ 11,642 పాయింట్ల వద్ద ఉంది. నేడు సెన్సెక్స్ 41,340 వద్ద, నిఫ్టీ 12,120 వద్ద ముగిసింది.

నాలుగు రోజులు అప్..
నిన్న సెన్సెక్స్ 355 పాయింట్లు(0.88%) లాభపడి 40,616 వద్ద, నిఫ్టీ 95 పాయింట్లు (0.80) ఎగిసి 11,908.50 పాయింట్ల వద్ద ముగిసింది.
మంగళవారం సెన్సెక్స్ 503.55 పాయింట్లు (1.27%) ఎగిసి 40,261.13 పాయింట్ల వద్ద, నిఫ్టీ 144.30 పాయింట్లు(1.24%) లాభపడి 11,813.50 పాయింట్ల వద్ద ముగిసింది.
అంతకుముందు రోజు సెన్సెక్స్ 143 పాయింట్ల లాభంతో ముగిసింది. నేడు సెన్సెక్స్ 724.02 పాయింట్లు(1.78%) లాభపడి 41,340.16 వద్ద, నిఫ్టీ 211.80 పాయింట్లు(1.78%) ఎగిసి 12,120.30 పాయింట్ల వద్ద ముగిసింది.
మొత్తంగా సెన్సెక్స్ 1700 పాయింట్లకు పైగా లాభపడింది.

జోబిడెన్ గెలుపుపై ఐటీ అదుర్స్, బ్యాంకింగ్ అదరగొట్టాయి
బీఎస్ఈ బ్యాంకెక్స్ అక్టోబర్ 30 27,388 వద్ద ఉండగా ఈ నాలుగు రోజుల్లో 2,798 పాయింట్లు లాభపడింది. ఈ రోజు 631 పాయింట్లు ఎగిసి 30,186 వద్ద ముగిసింది.
బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ నాలుగు రోజుల్లో 2,413 పాయింట్లు ఎగిసింది. అక్టోబర్ 30న 23,900 పాయింట్లుగా ఉంది. ఈ రోజు 541 పాయింట్లు లాభపడి 26,313 పాయింట్ల వద్ద ముగిసింది.
గత నాలుగు రోజుల్లో అత్యధికంగా లాభపడిన వాటిలో బ్యాంకింగ్ సెక్టార్ ముందు ఉంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోబిడెన్ గెలుస్తారనే అంచనాలతో నవంబర్ 3న ఐటీ స్టాక్స్ ర్యాలీ చేశాయి. 20,889 వద్ద ఉన్న బీఎస్ఈ ఐటీ సూచీ ఈ రెండు రోజుల్లో 667 పాయింట్లు ఎగిసి 21,556 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా ఫస్ట్ అని నినదిస్తున్న ట్రంప్ గెలిస్తే కష్టమని భారత్‌తో పాటు అమెరికా ఐటీ సెక్టార్ కూడా భావిస్తోంది. జోబిడెన్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తారని, ఆయన గెలుస్తారని వార్తలు రావడంతో ఐటీ స్టాక్స్ పుంజుకున్నాయి.
ఐసీఐసీఐ, ఎస్బీఐ, యాక్సస్ బ్యాంకు వంటి దిగ్గజ సంస్థలు వరుసగా నాలుగు సెషన్‌లలో లాభపడ్డాయి.

ఇన్వెస్టర్ల సంపద ఎంత పెరిగిందంటే?
ఈ వారం నాలుగు సెషన్‌లలో మార్కెట్లు భారీగా లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపద రూ.4.35 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ అక్టోబర్ 30న రూ.157.92 లక్షల కోట్ల నుండి రూ.162.27 లక్షల కోట్లకు పెరిగింది.
గతవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫలితాలు ప్రకటించాయి. ఆ తర్వాత వరుస రెండు సెషన్‌లలో ఈ స్టాక్ భారీగా నష్టపోయింది. తదుపరి తాజా రెండు సెషన్‌లలో స్వల్పంగా పెరిగింది.


Click it and Unblock the Notifications